శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణం-రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
విజయవాడ ముచ్చట్లు:
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధనను అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తిరుపతి శ్రీనివాస ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ 58, 59, 60, 61, 62వ సంయుక్త స్నాతకోత్సవంలో కులపతి హోదాలో గవర్నర్ హరిచందన్ విజయవాడ రాజ్‌భవన్ నుంచి వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో అనేక విభాగాలలో ఉన్నత ర్యాంక్ సాధించటమే కాకుండా, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్ధల నుండి నిధులు, పరిశోధన గ్రాంట్లు పొందడం, పరిశోధన ఒప్పందాలు చేసుకోవడం ముదావహమన్నారు. స్ధాపన నుండి నేటి వరకు విశ్వవిద్యాలయం అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని, నాక్ ద్వారా ఎ ప్లస్ గుర్తింపు పొందటమే కాక, దేశంలోని తొలి పది విశ్వవిద్యాలయాలలో ఒకటిగా యుజిసి గుర్తింపును, స్వయంప్రతిపత్తి హోదా పొందగలిగిందన్నారు.

జాతీయ విద్యా విధానం-2020 దేశంలోని ఉన్నత విద్యారంగంలో ప్రగతిశీల మార్పును తీసుకువచ్చి, ప్రముఖ దేశాలతో సమానంగా ముందడుగు వేయగల నమూనాగా ఉందన్నారు. జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీ ఛైర్పర్సన్ డాక్టర్ కస్తూరిరంగన్ మాట్లాడుతూ లిబరల్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వంటి మూడు ముఖ్యమైన అంశాలు ఈ విధానంలో ఉన్నాయన్నారు. భారతదేశం విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఉపకరిస్తుందన్నారు. ఎన్ఇపి సిఫార్సులలో భాగంగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ’ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అభినందనీయమన్నారు. ప్రముఖ పరోపకారి చంద్ర భాను సత్పతి, ప్రఖ్యాత అవధాని నరాల రామారెడ్డి, ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ ఇండ్ల రామ సుబ్బారెడ్డికి గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి అచార్య కె. రాజా రెడ్డి యూనివర్సిటీ వార్షిక నివేదికలను సమర్పించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ అచార్య హేమచంద్రారెడ్డి పాల్గొనగా, ఆచార్య ఆర్.వి.ఎస్. సత్యనారాయణ, అచ్యార్య ఎం. శ్రీనివాసులు రెడ్డి విశ్వవిద్యాలయం తరపున కులపతి హరిచందన్‌ను జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు.
Tags: Sri Venkateswara University is the pride of Andhra Pradesh-State Governor Bishwabhushan Harichandan
