ఘనంగా ముగిసిన శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం

Date:15/04/2019
 ఖమ్మం ముచ్చట్లు :
దక్షిణాది అయోధ్య భద్రాచలం ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం కనులపండువగా సాగింది. అశేష భక్తకోటి రామనామ స్మరణ మధ్య మిథిల ప్రాంగణంలో శ్రీరామపట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. మేళతాళాల నడుమ స్వామివారి ఉత్సవ మూర్తిని పల్లకిలో మిథిల స్టేడియానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం విశ్వక్షేణ ఆరాధనతో పట్టాభిషేక మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ క్రతువులో వినియోగించే పూజా ద్రవ్యాలకు పుణ్యహోచనం చేసి, పవిత్ర నదీజలాలతో స్వామివారికి అభిషేకం జరిపించారు. తర్వాత అష్టోత్తర, సహస్త్ర నామార్చన, సువర్ణపుష్పార్చన గావించారు. వసంత రుతువులో ఛైత్రశుద్ధ నవమి రోజు కళ్యాణం, ఆ మర్నాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించే సంప్రదాయం భద్రాచలంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. చైత్రశుద్ధ దశమిని ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు.
 రోజున శ్రీరామ నామస్మరణ చేస్తే మన మనసుకు ఆయనే రాజు అనే భావన స్థిరపడుతుంది. స్వామివారికి పట్టాభిషేక మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు హాజరయ్యారు. సోమవారం ఉదయం హెలికాప్టర్ ద్వారా భద్రాచలం చేరుకున్న గవర్నర్ దంపతులు తొలుత సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మిథిల మైదానంలో జరిగిన పట్టాభిషేకంలో పాల్గొని, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇక, ఎక్కువసార్లు భద్రాచలంలో జరిగిన శ్రీరామపట్టాభిషేకానికి హాజరైన గవర్నర్‌గా నరసింహన్ గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ భద్రాద్రికి ఆయన విచ్చేసి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు ఈ క్రతువు నిర్వహించగా, పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Tags:Sriramachandra Murthy is the grand celebration of the grand finale

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *