తాళ్లపాకలో వైభవంగా శ్రీవారి కల్యాణం
– ప్రారంభమైన అన్నమయ్య జయంతి ఉత్సవాలు
తాళ్లపాక ముచ్చట్లు:
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జయంతి ఉత్సవాలు సోమవారం అన్నమయ్య జిల్లా తాళ్ళపాక లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద ఉదయం శ్రీవారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది.
ఉదయం 10 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. పుణ్యహవచనం, పవిత్రహోమం, కంకణధారణ, మాంగళ్యధారణ, మంగళాశాసనం ఘట్టాలతో శ్రీవారి కల్యాణం జరిగింది. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం ముగిసింది. భక్తులకు టీటీడీ మంచినీరు, మజ్జిగ, ప్రసాదాలు అందించింది. శ్రీవారి కల్యాణం అనంతరం పెద్దసంఖ్యలో భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఉదయం 8 నుండి 9 గంటల వరకు నాదస్వర సమ్మేళనం, ఉదయం 9 నుండి 10 గంటల వరకు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి మునిలక్ష్మి, మోహన్ బృందం గాత్రం, శ్రీమతి ప్రమీల బృదం హరికథ గానం చేయనున్నారు.
రాజంపేట-కడప హైవేలో ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సోమవారం సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు శ్రీవారి ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం నిర్వహిస్తారు. రాత్రి 7.30 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి సీతాలక్ష్మి బృందం హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.ఈ కార్యక్రమంలో టీటీడీ హిదూ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి విజయసారధి, ఏఈవో సత్యనారాయణ, ప్రొగ్రాం అసిస్టెంట్ లత, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags:Srivari Kalyanam in glory in Tallapaka