Srivari Laddu Prasadam is half price for devotees

భ‌క్తుల‌కు సగం ధరకే  శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం

– టిటిడి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Date:23/05/2020

తిరుమ‌ల ముచ్చట్లు:

తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదాల‌ను సగం ధరకే మే 25వ తేదీ సోమ‌వారం నుండి రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో గ‌ల‌ టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల్లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో   ఏ.వి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం నుండి రాష్ట్రంలోని వివిధ‌ జిల్లాల‌కు ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను తీసుకు వెళ్ళే లారీల‌ను శ‌నివారం ఉద‌యం ఆయ‌న ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా భ‌క్తుల‌కు తిరుమల‌ శ్రీవారి ద‌ర్శ‌నాన్ని దాదాపు 60 రోజులుగా నిలిపివేసిన‌ట్లు తెలిపారు. తిరిగి భక్తులకు స్వామి వారి దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.  ఈ నేపథ్యంలో అధిక సంఖ్య‌లో భక్తులు ఇ-మెయిల్‌,  వాట్స‌ప్‌, ఫొన్ల‌ల ద్వారా  తమకు స్వామివారి లడ్డూ ప్రసాదం అయినా అందించాలని విజ్ఞప్తులు వచ్చాయ‌న్నారు.  భ‌క్తుల అభ్య‌ర్థ‌న‌లు పరిగణనలోకి తీసుకుని, లాభ నష్టాలను చూడకుండా రూ.50/- ల‌డ్డూను రూ.25/- కు త‌గ్గించి భ‌క్తుల‌కు అందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో గ‌ల‌ టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల్లో 15 వేల నుండి 20 వేల ల‌డ్డూల‌ను ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. క‌ల్యాణ‌మండ‌పాల్లోని టిటిడి ఉద్యోగులు, హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఉద్యోగులు, శ్రీ‌వారి సేవ‌కులు, పోలీస్‌, రెవెన్యూ అధికారుల స‌మ‌న్వ‌యంతో  భౌతిక దూరం పాటిస్తూ భ‌క్తుల‌కు ల‌డ్డూ ప్ర‌సాదాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు వివ‌రించారు.

 

 

అదేవిధంగా శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం ల‌డ్డూను స్వామివారి క‌ల్యాణంలో నివేదించేందుకు అవ‌స‌ర‌మైన ల‌డ్డూల‌ను మాత్ర‌మే త‌యారు చేస్తున్న‌ట్లు తెలిపారు. కావున జిల్లా కేంద్రాల్లో గ‌ల‌ టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల‌లో చిన్న ల‌డ్డూల‌ను మాత్ర‌మే పంపీణి చేస్తున్నామ‌న్నారు. శ‌నివారం ఉద‌యం శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌పట్నం, గుంటూరు, కృష్ణా, తూర్పు, ప‌శ్చిప గోదావ‌రి జిల్లాల‌కు రెండు‌ లారీల‌లో ల‌డ్డూ ప్ర‌సాదాలు బ‌య‌లు దేరిన‌ట్లు తెలియ‌జేశారు. అదేవిధంగా ఆదివారంనాటికి రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల‌కు తిరుమ‌ల నుండి ల‌డ్డూ ప్ర‌సాదాలు చేరుతాయ‌న్నారు.  అంత‌కుముందు తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ఆధ్వ‌ర్యంలో నాద‌నీరాజ‌నం వేదిక‌పై “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణంలో భాగంగా 44వ రోజైన శ‌నివారం ఉద‌యం  అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు. అనంత‌రం రోహిణి న‌క్ష‌త్రం పుర‌స్క‌రించుకుని ఆయ‌న గోపూజ నిర్వ‌హించారు.

ఉపాధి పనుల్లో వేగం పెంచండి

Tags: Srivari Laddu Prasadam is half price for devotees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *