వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల ముచ్చట్లు:
గత మూడురోజులుగా తిరుమలలోని వసంతోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్న సాలకట్ల వసంతోత్సవాలు బుధవారంనాడు కన్నుల పండుగగా ముగిశాయి.తొలిరోజు, రెండవరోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేరులతో కూడి వసంతోత్సవంలో పాల్గొన్నారు. చివరిరోజున శ్రీ భూ సమేత మలయప్పస్వామితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. కాగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవరులను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ్యర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ్యర్‌స్వామి, ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, ఇతర తదితరులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags: Srivari Salakatla Vasantotsavam ended with a bang
