తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీయాగం
-జనవరి 20న అంకురార్పణ
తిరుపతి ముచ్చట్లు:
ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ జనవరి 21 నుండి 27వ తేదీ వరకు ఏడు రోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీయాగం నిర్వహించనున్నారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో ఏకాంతంగా ఈ యాగం జరుగనుంది. అర్చకులు శ్రీ పి.శ్రీనివాసన్ ఈ యాగానికి ప్రధానాచార్యులుగా వ్యవహరిస్తారు. ఈ యాగ కార్యక్రమాలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించవచ్చు.జనవరి 20న గురువారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.జనవరి 21న మొదటిరోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు యాగశాల హోమాలు, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ట, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం,
మహామంగళహారతి నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం, మహామంగళహారతి చేపట్టి అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. జనవరి 22 నుండి 26వ తేదీ వరకు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీయాగం కార్యక్రమాలు నిర్వహిస్తారు.జనవరి 27న చివరిరోజు ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు చతుష్టానార్చన, హోమాలు, మహాప్రాయశ్చిత్త హోమం, మహాశాంతి హోమం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు మహాపూర్ణాహుతి చేపడతారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు అభిషేకం మరియు అవభృతం నిర్వహిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
శ్రీయాగం కారణంగా జనవరి 20 నుండి 27వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను టిటిడి రద్దు చేసింది. జనవరి 20, 21, 27వ తేదీల్లో బ్రేక్ దర్శనం రద్దు చేయడమైనది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Sriyagam at the temple of Sri Padmavati Ammavari in Thiruchanur