స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరిస్థితి విగ్రహ పుష్టి.. నైవేద్య నష్టి

Date:12/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఇప్పుడు విగ్రహ పుష్టి.. నైవేద్య నష్టి. కానీ గత నాలుగేళ్ళుగా ఉన్నత విద్యా మండలి మూలనున్న ముసలమ్మ ఇచ్చే సలహాల్లాంటి సిఫార్సులను ఇస్తున్నదే తప్ప ఖచ్చితమైన విధానాలు, కఠినమైన నిర్ణయలను అమలు చేసిన దాఖలాలు లేవు.నిజానికి ఉన్నత విద్యా మండలి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ కాలేజీలపై ఆజమాయిషీ చేయాలి. సంస్కరణలకు ప్రాణం పోయాలన్నా, ప్రమాణాలను నిర్ధారించాలన్నా ఉన్నత విద్యా మండలిదే చివరి మాట. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత నుంచి ఇది ఒక ఉత్సవ విగ్రహంగా మాత్రమే మిగిలింది.విషాదం ఏమిటంటే రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల వివరాలు, అవి నిర్వహిస్తున్న కోర్సులు, ఒక్కో కోర్సుకు మంజూరైన సీట్లు వంటి వివరాలను కూడా ఉన్నత విద్యా సంస్థ సేకరించలేకపోయింది.
అంతే కాదు, ఈ మధ్యే కొందరు వైస్ చాన్స్‌లర్లపై రకరకాల ఫిర్యాదులు వస్తే వాటిని విచారించేందుకు ఏర్పడిన కమిటీలు పుణ్యకాలం గడిచినా నివేదికలు తయారు చేయలేకపోయాయి. ఈ కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి పనితీరును తీవ్రంగా అభిశంసించింది కూడా. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు.డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో అవకతవకలపై విచారణ చేసేందుకు ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన కమిటీ  తన పర్యటననే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. యూనివర్సిటీ అధికారులకు కమిటీ రాక గురించి ముందస్తు సమాచారం అందడం వల్లే వారు అప్రమత్తమయ్యారు.
దీంతో వెళ్లి లాభం లేదని కమిటీ పర్యటనను వాయిదా వేసుకుంది. ఆ తరువాత ఇప్పటి వరకూ కమిటీ వెళ్లలేదు. విచారణ నివేదిక అందలేదు. కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరీక్షల్లో కొన్ని కొన్ని విషయాల్లో విద్యార్ధులకు వందకు 115 మార్కులు వచ్చాయి. ఈ నిర్లక్ష్యానికి కారకులపై ఇప్పటి వరకూ చర్యలు లేవు. కొన్ని కొన్ని నియామకాల విషయంలోనూ అవకతవకలున్నట్టు తేలినా ఎలాంటి చర్యలూ లేవు. మొత్తానికి పుల్లయ్య వేమవరం వెళ్లనూ వెళ్లాడు. రానూ వచ్చాడన్నట్టు తూతూ మంత్రం పద్ధతిలో పనులు జరుగుతున్నాయి.ఉన్నత విద్యామండలి రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలను ఏ మాత్రం నియంత్రించలేకపోవడం ఒక కఠోరమైన నిజం. ఆయా విశ్వవిద్యాలయాలలోని కోర్సులు, సీట్లు, సీట్ల భర్తీ వంటి వివరాలను సైతం మండలి సేకరించడంలో  విఫలమైంది.
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను ఆన్ లైన్ విధానంలో భర్తీ చేస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీల వారీగా, వాటి అంతర్గతంగా పనిచేసే కాలేజీల వారీగా వివరాలను మండలి కోరింది. కానీ యూనివర్సిటీలు అరకొరగా, అసమగ్రంగా వివరాలను అందచేశాయి. గత ఏడాది ఆగస్టు 8 నాడు గవర్నర్ యూనివర్సీటీల వైస్ చాన్స్‌లర్ల సమావేశంలో పీహెచ్‌డీ ల ప్రమాణాలు పడిపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి, గత మూడేళ్ల  పీహెచ్‌డీ ప్రవేశాల వివరాలను తనకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిని సేకరించే బాధ్యత ఉన్న ఉన్నత విద్యా మండలి మహాజర్లు పంపుతూ, అప్పీళ్లు చేస్తూ కాలయాపన చేస్తూందే తప్ప ఖచ్చితంగా పనిచేసి, కావలసిన సమాచారాన్ని సేకరించలేకపోతోంది.ఉన్నత విద్యారంగ ప్రమాణాలను మెరుగుపరచడం, వాటినీ స్టాండర్డైజ్ చేయడం అత్యవసరం. రానున్న రోజుల్లో విశ్వవ్యాప్త పోటీని తట్టుకునేలా నైపుణ్యాలను, సామర్థ్యాలను, విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించవలసిన అవసరం ఉంది.
ఈ మేరకు విద్యా ప్రమాణాలు, ప్రక్రియల ప్రమాణీకరణ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. బాధ్యతను నిర్వర్తించాల్సిన ఉన్నత విద్యామండలి పరిస్థితి మాత్రం ‘ఒక అడుగు ముందుకు… రెండడుగులు వెనక్కి‘ అన్నట్టుగా ఉంది. రానున్న రోజుల్లో ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్యా సంస్థల్లో విద్యార్థి రుసుములను నిర్ధారించేందుకు, , ఇతర కాలేజీల్లో ఫీజుల వ్యవస్థ నిర్ధారణ చేసేందుకు, కొన్నికొత్త కోర్సులకు అనుమతులను ప్రదానం చేసేందుకు త్వరలో ఏఎఫ్‌ఆర్ సీ నోటిఫికేషన్ జారీ చేయనున్న పరిస్థితి ఉంది. ఈ విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు.
ఇంత ప్రముఖమైన వ్యవస్థ నీరుకారిపోకుండా చూసుకోవడం చాలా అవసరం. ఉన్నత విద్యామండలి తన ప్రాభవాన్ని,ప్రభావాన్ని మళ్లీ పొందేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ సంస్థ ‘పేరు గొప్ప ఊరు దిబ్బ‘ అన్న చందాన మిగిలిపోతుంది. ఉదాహరణకు అత్యంత కీలకమైన అకాడమిక్ సెల్‌కు పర్మనెంట్ ఉద్యోగి లేరు.ఒక సేవానివృత్త అధికారి కన్సల్టెంట్ హోదాలో పనులు నిర్వహిస్తున్నారంటేనే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలను సృష్టించడం చాలా సులువు.కానీ వాటిని సమర్థవంతంగా నిర్వహించాలంటే చిత్తశుద్ధి కావాలి. ప్రభుత్వం ఉన్నత విద్యామండలికి పాలపళ్లు అమరిస్తే చాలదు.
Tags:State Council of Higher Education Status Statue

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *