వానాకాలంలో  ఉక్కపోతలు

విశాఖపట్టణం  ముచ్చట్లు:

ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. కానీ వాతావరణం వేసవి అనుభూతిని కలిగిస్తోంది. ఒకపక్క ఉష్ణతాపం, మరోపక్క ఉక్కపోత వెరసి జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో చల్లదనం పరచుకుంటున్నా, అవి బలహీన పడ్డాక సూర్యుడు చుర్రుమంటున్నాడు. కొద్దిరోజుల నుంచి ఈ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వీటి తీవ్రత ఒకింత ఎక్కువగానే ఉంటోంది. కొన్నాళ్లుగా విశాఖపట్నంలో సాధారణం కంటే 2–4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి వేడిని వెదజల్లుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆకాశంలో కొద్దిపాటి మబ్బులు కమ్ముకుంటున్నా వాతావరణంలో అంతగా చల్లదనం కనిపించడం లేదు. మేఘాలు కనుమరుగయ్యాక భానుడు ప్రతాపం చూపుతున్నాడు. కొద్దిపాటి సమయానికే సూర్య తాపం తీవ్రత పెరిగి చిర్రెత్తిస్తున్నాడు. మరోవైపు దీనికి ఉక్కపోత కూడా తోడవుతోంది. సాధారణంగా ఇతర ప్రాంతాలకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉక్కపోత అధికంగా ప్రభావం చూపుతుంది. వేసవిలో మరింత తీవ్రరూపం దాలుస్తుంది.

 

 

కానీ ప్రస్తుతం వర్షాల సీజనే అయినా అధిక ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత కూడా కొనసాగుతోంది. ఫలితంగా జనానికి ముచ్చెమటలు పోస్తున్నాయి. దీంతో వేసవి సీజనులో మాదిరిగా పగలే కాదు.. రాత్రి వేళల్లోనూ ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను విరివిగా వినియోగిస్తూ ఉపశమనం పొందుతున్నారు. కొద్దిరోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు/ద్రోణులు గాని, ఆవర్తనాలు గాని లేవు. దీంతో వర్షాలు కూడా కురవడం లేదు. ప్రస్తుతం పశ్చిమం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. ఇలా విశాఖలో గాలిలో తేమ శాతం 60 నుంచి దాదాపు 90 శాతం వరకు ఉంటోంది. సాధారణంగా గాలిలో తేమ 50 శాతం ఉంటే ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. అంతకుమించితే ఉక్కపోత ప్రభావం మొదలవుతుంది.ఆకాశంలో మేఘాలు ఏర్పడుతున్నా అవి వచ్చి పోతున్నాయి తప్ప స్థిరంగా ఉండడం లేదు. దీంతో సూర్య కిరణాలు నేరుగా భూ ఉపరితలంపైకి ప్రసరిస్తున్నాయి. ప్రస్తుతం విపరీతమైన ఉక్కపోతకు గాలిలో అధిక తేమ, ఉష్ణోగ్రతలు పెరుగుదలకు మేఘాలు, వర్షాలు లేకపోవడం వంటివి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం వంటిది ఏర్పడే వరకు కొద్దిరోజుల పాటు కొనసాగుతుందని వీరు పేర్కొంటున్నారు.

 

Tags; Steel drains during rainy season

Leave A Reply

Your email address will not be published.