ఒడిశాలో కొత్త పార్టీ దిశగా అడుగులు…

Steps towards new party in Odisha

Steps towards new party in Odisha

 Date:22/09/2018
భువనేశ్వర్ ముచ్చట్లు:
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సొంత పార్టీ నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వంలో అవినీతి హెచ్చుమీరుతుందని, మొక్కలు నాటే కార్యక్రమంలోనే కోట్లు మారాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈనేపథ్యంలో నవీన్ పట్నాయక్ ఈ ఆరోపణల నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని సస్పెండ్ చేస్తున్నారు. కొంతమంది సీనియర్ నేతలపై బహిష్కరణ వేటు వేస్తున్నారు.
తన తండ్రి బిజూ పట్నాయక్ కు అత్యంత సన్నిహితులైన వారిని కూడా వదిలిపెట్టడం లేదు. దీంతో బిజూ పట్నాయక్ విధేయులు, నవీన్ పట్నాయక్ వ్యతిరేకులంతా ఒక్కటవుతున్నారు. వారంతా కలిసి ఒక్కటై నవీన్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఒక్కటవ్వడమే కాదు రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ కు వ్యతిరేకంగా కొత్తగా పార్టీ పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇది ఒకరకంగా నవీన్ పట్నాయక్ ను ఆందోళనలో పడేసే అంశమే.
ఇప్పటికే గత పదిహేనేళ్లుగా ఉన్న ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలు ఒడిశాపై ప్రత్యేక దృష్టిని సారించాయి. మోదీ వరుస పర్యటనలతో ఒడిశాలో పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ పరిస్థితుల్లో నవీన్ పట్నాయక్ కు సొంత పార్టీ కి చెందిన నేతలు తలనొప్పిగా తయారయ్యారు.బిజూ జనతాదళ్ ను రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించారు.
తన తండ్రిపేరు మీద స్థాపించిన పార్టీలో తొలుత క్రియాశీలకంగా పనిచేసిన వారందరిని ఒక్కొక్కరినీ నవీన్ బయటకు పంపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇందులో దామోదర్ రౌత్ ఒకరు. బిజూ పట్నాయక్ కు అత్యంత సన్నిహితుడు. ఈయనను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత సొంత పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన వెంట దిలీప్ రే, రామకృష్ణ పట్నాయక్, బిజయ్ మహాపాత్ర, పంచానన్ కొనుంగోలు కూడా ఉన్నారు. వీరంతా బిజూ పట్నాయక్ కు అత్యంత సన్న్ిహితులు.
ఇందులో పంచానన్ మాత్రమే బిజూ జనతాదళ్ లో ఉన్నారు. దిలీప్ రే, రామకృష్ణ పట్నాయక్, బిజయ్ మహాపాత్రలు బీజేపీలోకి వెళ్లారు. భారతీయ జనతా పార్టీలోకి వెళ్లినా వీరు పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం గమనార్హం.అయితే బిజూ పట్నాయక్ సన్నిహితులు, నవీన్ వ్యతిరేకులతో కలిసి ఒడిశాలో కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
తామెవ్వరం బీజేపీ, కాంగ్రెస్ లో చేరేది లేదని, సొంత పార్టీతోనే తాము ముందుకు వెళతామంటున్నారు బిజూ పట్నాయక్ ఆశలు, ఆశయాలను సాధించడమే తమ ఉద్దేశ్యమంటున్నారు. ఇప్పటికే నవీన్ పట్నాయక్ వ్యవహార శైలితో విసిగిపోయిన కొందరు వీరి గూటికి చేరే అవకాశముందంటున్నారు. వీరంతా కలసి నవీన్ కు చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు.
అయితే వీరి వెనక కమలం పార్టీ ఉందన్న అనుమానాలూ లేకపోలేదు. బిజూ జనతాదళ్ చీలిపోయిందన్న కలర్ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లను చీల్చే ప్రయత్నమేనని బిజూ జనతా దళ్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి కొన్ని ఏళ్లుగా ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న నవీన్ పట్నాయక్ ను వీరు నిలువరించగలారా? అన్నది అనుమానమే.
Tags:Steps towards new party in Odisha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *