విశాఖలో జనసేన  విస్తరణ దిశగా అడుగులు

Steps towards the expansion of Janesena in Visakhapatnam

Steps towards the expansion of Janesena in Visakhapatnam

Date:23/11/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
విశాఖ జిల్లాలో పాతుకుపోవాలని జనసేన పార్టీ భావిస్తోంది. అయితే జనం మాట దేముడెరుగు ఈ వైపుగా చూసే నాయకులు కూడా ఎవరూ లేకపోవడంతో తెగ మధన పడుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువ సీట్లు ఉన్న విశాఖ జిల్లాలో ఎలాగైనా జెండా ఎగరేయాలన్న జనసేనాని పవన్ ఆశయం నెరవేరకపోవడంతో ఈ మధ్య కాలమంతా నిరాశతోనే పార్టీ పెద్దలు ఉన్నారు. స్వయంగా పవన్ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్ళి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించారు. దాంతో విశాఖలో పార్టీ ఎదుగుదల ప్రశ్నార్ధకమైంది.ఇటువంటి క్ర్లిష్ట పరిస్థితుల్లో విశాఖ జిల్లా నుంచి పెద్ద నాయకుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేనలో చేరడంతో పవన్ ఆనందభరితుడయ్యారని టాక్. అయితే దీనికి తెర వెనక కృషి చేసినది మాత్రం మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. ఆయనకు బాలరాజుతో ఉన్న సాన్నిహిత్యమే వైసీపీ వైపుగా వెళ్తున్న బాలరాజుని జనసేన రూట్ పట్టించింది. ఇపుడు విశాఖ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఓ నాయకుడు దొరికాడు. ఈ ఊపులో మరిన్ని చేరికలు జరగాలని పవన్ గట్టిగా కోరుకుంటున్నారుట.
వీలైనంత మందిని పార్టీలోకి రప్పించి కండువాలు కప్పేద్దామని ఆత్రపడుతున్నట్లుగా భోగట్టా.ఇక బాలరాజు చేరిక సందర్భంగా విశాఖ నగరంలో తాజాగా భారీ మీటింగును కూడా జన సైనికులు నిర్వహించారు. ఆ మీటింగుకు పవన్ ఫ్యాన్స్ బాగానే హాజరై విజయవంతం చేశారు. ఈ క్రమంలో బాలరాజుని కేంద్ర బిందువుగా చేసుకుని విశాఖ జిల్లా రాజకీయాలను నడపాలని పవన్ భావిస్తున్నారని సమాచారం, బాలరాజుని జిల్లా పార్టీ అధ్యక్షుడిని చేసి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. అదే విధంగా విశాఖ జిల్లాలోని టీడీపీ, వైసీపీల నుంచి సీనియర్ నాయకులను పార్టీలోకి రప్పించే బాధ్యతను కూడా బాలరాజుకు అప్పగించారని తెలుస్తోంది.బాలరాజుకు అన్ని పార్టీల నేతలతో ఉన్న పరిచయాలు, సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున వలసలకు తెర తీయాలని జనసేన భావిస్తోంది. మరి రెండు ప్రధాన పార్టీలూ అధికారంలోకి వస్తామని నమ్మకంగా ఉన్నాయి. టికెట్ల విషయంలో తేడా వచ్చినా అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అధినేతలు హామీలు ఇస్తున్నారు. దీంతో జనసేన వైపుగా ఎవరూ తొంగి చూడడంలేదు. రానున్న రోజుల్లో ఎవరైన చేరితే మాత్రం అది బాలరాజు మ్యాజిక్ గానే చెప్పుకోవాలి. ఏది ఏమైనా నెమ్మదిగా రాజకీయం చేస్తే బాలరాజు నెత్తి మీద పెద్ద బాధ్యతనే జనసేన పెట్టిందని అంటున్నారు. చూడాలి మరి ఆయన ఎంతవరకూ నెగ్గుకుని వస్తారో.
Tags:Steps towards the expansion of Janesena in Visakhapatnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *