ఆగని మాఫియా ఆగడాలు.. (కర్నూలు)

Stop mafia agoda .. (Kurnool)

Stop mafia agoda .. (Kurnool)

Date:12/10/2018
కర్నూలు  ముచ్చట్లు:
నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుకను కొంతమంది అక్రమార్కులు యథేచ్ఛగా తోడేస్తున్నారు. నదిలో ఇసుక రీచ్‌లకు అనుమతులు లేకపోయినా.. రాజకీయ నేతల అండదండలు, అధికారుల ప్రోద్భలంతో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి తోడేసి జేబులు నింపుకొంటున్నారు. ఇసుక తరలి పోవడంతో భూగర్భ జలాల స్థాయి పాతాళానికి చేరే పరిస్థితి తలెత్తుతోంది. నదీతీర గ్రామాల్లో నీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది.
కల్లూరు, కర్నూలు మండలాల పరిధిలో హంద్రీ, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉండే ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.
కర్నూలు మండల పరిధిలో జి.సింగవరం, నిడ్జూరు, పంచలింగాల, ఈ.తాండ్రపాడు, తదితర ప్రాంతాల నుంచి అధికారుల కళ్లెదుటే వందల ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. కల్లూరు మండల పరిధిలోని లక్ష్మీపురం, బస్తిపాడు, వెంగన్నబావి, దూపాడు, దొడ్డిపాడు ప్రాంతాల్లోని హంద్రీ నదీ పరివాహ ప్రాంతంలో ఇసుక తరలించేందుకు రెవెన్యూ అధికారులే సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. నగరంలో జొహరాపురం, బండిమెట్ట, జమ్మిచెట్టు, జాతీయ రహదారిపై ట్రాక్టర్ల వేగం, మోత చూసిన జనం విస్తుపోతున్నారు. ఏ అధికారి పట్టించుకోపోతే ఎలా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
అధికారులకు కూతవేటు దూరంలో నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని తుంగభద్ర, హంద్రీ తీరాన వారికి ఆగడాలు, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అక్రమ రవాణాను నియంత్రించాల్సిన భూగర్భ, మైనింగ్‌ అధికారులు, ట్రాక్టర్లను తనిఖీ చేయాల్సిన ఆర్టీవో, పోలీసు శాఖలు నిద్రమత్తు వీడడం లేదు. కొందరు ఏకంగా కళ్లెదుటే కనిపిస్తున్నా తమకు సంబంధం లేదని ఒకరిపై ఒకరు చెప్పుకోవడం సాధారణమైపోయింది. నదిలో ఉన్నప్పుడు తూతూమంత్రంగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసే అవకాశం రెవెన్యూ అధికారులకు ఉంది.
వారికి ఇసుక రవాణా కనిపిస్తున్నా.. ఆ శాఖ వీఆర్వోలు, గ్రామ సహాయకులు ఎవరూ నోరు విప్పడం లేదు. భూగర్భజలాలు తరగకుండా చూడాలనే బాధ్యత ఉన్నా.. పట్టించుకోవడం లేదు. అక్రమార్కుల నుంచి ముడుపులు అందుతున్నందునే దాడులు  నిర్వహించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసే వరకు మాత్రమే తమ బాధ్యత అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక తమ వద్ద సిబ్బంది కొరత ఉందని చెబుతున్న అధికారులు దృష్టి పెట్టడం లేదు.
రోడ్డుపైకి వచ్చిన ట్రాక్టర్లను పోలీసులు పట్టుకోరాదనే నిబంధన ఉన్నా, కానిస్టేబుళ్లు వెంటపడి డ్రైవర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనినే ఆదాయంగా మార్చుకున్న వారంతా ట్రాక్టర్లను స్టేషన్లకు తరలిస్తున్నారు. అనధికారికంగా అక్రమంగా తరలించే ఇసుకను అక్రమార్కులు వేలాది రూపాయలకు అమ్ముకుంటూ ఆదాయం గడిస్తున్నారు. కర్నూలు నగర శివారు ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. వీటన్నింటికి అక్రమంగా తరలించిన ఇసుకనే వినియోగిస్తున్నారు.
కొన్ని స్థిరాస్తి వెంచర్లలో పెద్దఎత్తున నిల్వలు ఉంచకుంటున్నారు. వెంచర్లకు ఆయా గ్రామాల్లో ఉండే ట్రాక్టరు యజమానులు రాత్రివేళ గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్తున్నారు. నగర ప్రాంతంలో డిమాండును బట్టి ఇసుక రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అమ్ముతున్నారంటే ఎంతమేర సొమ్ము చేసుకుంటున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి మూడు క్యూబిక్‌ మీటర్ల ఇసుకను రీచ్‌ నుంచి కర్నూలువాసులకు రూ.2,500లకు మించి విక్రయించరాదని స్వయానా జిల్లాస్థాయి ఇసుక కమిటీ తీర్మానించినా నిబంధన అమలు కావడం లేదు.
Tags:Stop mafia agoda .. (Kurnool)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *