స్టేతో సమస్య ఆగిపోతుందా?

Date:15/02/2018
చిత్తూరు ముచ్చట్లు:
మతోద్ధరణ పేరుతో టీటీడీలో హిందువులకూ అన్యాయం జరుగుతోందా? సర్టిఫికేట్ లోని పొరపాట్లకు కొందరు ఉద్యోగులు బలవుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పూర్వాపరాలు ఆరాతీయకుండా కేవలం సర్టిఫికేట్ల ఆధారంగా టీటీడీ అధికారులు కొందరు హిందువులను.. హిందూయేతరులుగా పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాలతోనే హిందూయేతరులుగా భావిస్తున్న వారిని విధులనుంచి తొలగించాలని నిర్ణయించిందని అంటున్నారు. ఏదైతేనేం.. వేటు ఎదుర్కొంటున్న బాధితుల గోడుపై హైకోర్టు స్పందించింది. ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ టీటీడీ జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. దీంతో బాధితులకు ఊరట లభించినట్లైంది. సర్టిఫికెట్స్ లో పొరపాట్లను కాకుండా దశాబ్దాలుగా తాము అనుసరిస్తున్న హిందు మతాన్నే పరిగణనలోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో నిజాయితీగా పనిచేస్తూ స్వామివారిని నిష్టగా సేవిస్తున్న తమను అసలు హిందువులే కాదనడం తట్టుకోలేకపోతున్నామని చెప్తున్నారు.కులాన్ని బట్టి కాకుండా మతాన్ని బట్టి టీటీడీ ముందడుగేయాలని బాధితులు కోరుతున్నారు. తమ నేపథ్యం తెలుసుకోకుండా ఉన్నపాటున ఉద్యోగాల్లోంచి తీసేందుకు అధికారులు సిద్ధపడుతుండడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవాలు గ్రహించకుండా వివాదాలు సృష్టించి కొందరు ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేస్తున్నారని వాపోతున్నారు. నోటీసులు అందుకున్న వారిలో పలువురికి సహోద్యోగులు అండగా నిలబడుతున్నారు. తమ తోటి ఉద్యోగులు ఎలాంటి వారో తమకు బాగా తెలుసని.. టీటీడీని అనవసర వివాదాల్లోకి లాగడం సరికాదని సూచిస్తున్నారు. టీటీడీలో పనిచేస్తున్న హైందవేతరులు అందరూ ఉపాది కోసం చేరిన వారే తప్ప అక్కడికి వచ్చే భక్తులను మతమార్పిడులకు గురిచేసే వారు కాదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. మత చిచ్చు రేపి తిరుపతిని మరో అయోద్యగా మార్చేందుకు మతతత్వ శక్తులు కుట్ర పన్నుతున్నాయని ఆరోపిస్తున్నారు. మతతత్వ శక్తులకు భయపడి టీటీడీ అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారని పదుల సంఖ్యలో కుటుంబాలను ప్రభావితం చేసి వారి భవితను ప్రభావితం చేయడం సరికాదని సూచిస్తున్నారు.
Tags: Stop stalling problem?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *