వన్యప్రాణుల వేటను అడ్డుకోండి

Stop wildlife hunting

Stop wildlife hunting

Date:24/04/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
వన్యప్రాణుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో వేటగాళ్ల ఆగడాలు సమర్ధవంతంగా నిలువరిస్తోంది. అయితే కొందరు దుండగులు మాత్రం భద్రతాసిబ్బంది కళ్లుగప్పి అటవీజంతువుల ప్రాణాలు తోడేస్తున్న ఘటనలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ తరహా ఉదంతమే ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. బోరిగామ ప్రాంతంలో ఇటీవలే కొందరు ఓ జింకను పొట్టనపెట్టుకున్నారు. విగతజీవిగా పడిఉన్న జింకను గమనించిన స్థానికులు అటవీసిబ్బందికి సమాచారమిచ్చారు. అయితే వారు తీరిగ్గా కుక్కల దాడిలో జింక ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఈ విషయమై గ్రామస్తులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. వన్యప్రాణి చనిపోయినప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి. మృతికి గల కారణాలు తెలుసుకోవాలని. అలాకాకుండా అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడాన్ని స్థానికులు విమర్శిస్తున్నారు. వేటగాళ్లే జింకను చంపి ఉంటారని స్థానికులు అంటున్నారు. ఈ సంగతి అటవీశాఖ అధికారులకూ తెలిసే ఉంటుందని, అందుకే వారు ఈ విషయమై నిర్లక్ష్యంగా వ్యవహించారని ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే జింక మృతిని తీవ్రంగా పరిగణించిన అటవీశాఖ ఉన్నతాధికారులు స్థానికి సిబ్బందిలో కొందరిని సస్పెండ్ చేసింది. అయితే ఇలాంటి చర్యలతో వన్యప్రాణుల వేటకు పెద్దగా చెక్ పడదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితిలో మార్పు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. వన్యప్రాణులను రక్షించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అయితే వేటగాళ్లు రాత్రిళ్లు అడవుల్లో చొరబడుతూ జంతువులను వేటాడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ తంతు సాగుతున్నట్లు గతంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికైనా అటవీశాఖ స్పందించి వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. లేదంటే అటవీ జంతువుల జాడ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
Tags:Stop wildlife hunting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *