కాగామహాకూటమి సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన 

– అభ్యర్థుల జాబితాను శుక్రవారం అధికారికంగా విడుదల: ఉత్తమ్‌
హైదరాబాద్‌  ముచ్చట్లు:
కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఖరారైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జాబితా ఇంకా ఖరారు కాలేదని… దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జాబితాపై వస్తున్న వార్తలను పార్టీ నేతలు, కార్యకర్తలు నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానంతో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు.
అభ్యర్థుల జాబితాను శుక్రవారం అధికారికంగా విడుదల చేస్తామని ఉత్తమ్‌ కటించారు.కాగామహాకూటమి సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీపావళి నాటికి స్పష్టత వస్తుందని భావించినప్పటికీ సీపీఐ, తెలంగాణా జనసమితి సీట్ల వ్యవహారం తేలలేదు. కాంగ్రెస్‌ ప్రతిపాదించిన సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై సీపీఐ, తెజస పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మహాకూటమి సీట్ల సర్దుబాటు, తెజస, సీపీఐకి ప్రతిపాదించిన స్థానాలపై కోదండరాం, సీపీఐ నేతలు ఇవాళ హైదరాబాద్‌లో సమావేశమై చర్చించారు. తెదేపాకు కేటాయించే సీట్లపై స్పష్టత వచ్చినప్పటికీ సీపీఐ, తెజస సీట్ల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
సీపీఐ తమకు 9 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్‌కు ప్రతిపాదనలు పంపగా మూడు సీట్లకు మించి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. పొత్తులో భాగంగా ఐదు స్థానాలు (హుస్నాబాద్‌, కొత్తగూడెం, వైరా, బెల్లంపల్లి, మంచిర్యాల) తమకు ఖచ్చితంగా ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది. కాంగ్రెస్‌ మాత్రం మంచిర్యాల, బెల్లంపల్లి, వైరా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయగా సీపీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏకంగా రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఆశిస్తున్న హుస్నాబాద్‌ను ఇచ్చేందుకు కాంగ్రెస్‌ నిరాకరించింది. ఈ విషయాన్ని సీపీఐ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లింది. కాంగ్రెస్‌, సీపీఐ నేతల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి.
ఈ చర్చల్లో మూడు స్థానాలతో పాటు భవిష్యత్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.కొత్తగూడెం సీటు తమకే ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది. కనీసం నాలుగు స్థానాలైనా తమకు ఇవ్వాలని కోరుతోంది. కొత్తగూడెం సీటును కాంగ్రెస్‌ నిరాకరించడంతో ఆ సీటును ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్ట నాయకత్వం అతన్ని బుజ్జగిస్తూనే ఆ సీటును దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం అత్యవసరంగా సమావేశంకానుంది.
ఈ సమావేశంలో తాజా పరిణామాలపై చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ కేటాయించిన హుస్నాబాద్‌ నుంచి చాడ వెంకట్‌ రెడ్డి, వైరా-బానోత్‌ విజయ, బెల్లంపల్లి సీటుకోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. రాష్ట్ర నాయకత్వం సమావేశమై ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేయనుంది.తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మహాకూటమి సీట్ల సర్దుబాటు, సీపీఐ, తెజసకు కేటాయించే స్థానాలపై చర్చించేందుకు తెజస అధ్యక్షుడు కోదండరాం ముఖ్ధూం భవన్‌కు వెళ్లారు.
సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, జాతీయ నేత నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో ఆయన సమావేశమై పలు అంశాలపైన చర్చించారు. కాంగ్రెస్‌ పార్టీ తెజసకు కేటాయించే స్థానాలపై ఆ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 14 స్థానాల ఇవ్వాలని తెజస కోరుతుండగా 9 సీట్లకు మించి ఇవ్వలేమని కాంగ్రెస్‌ తేల్చి చెప్పింది.
ఇచ్చే 9 స్థానాల్లోను తెజస కోరేసీట్లు కేవలం 5 మాత్రమే ఉన్నాయని.. రెండు కోరనివి, ఏమాత్రం బలంలేని మరో రెండు స్థానాలను ఇస్తామని చెప్పడంతో ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అంతేకాకుండా తెజసకు కేటాయించిన కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ స్నేహాపూర్వక పోటీ చేస్తుందని చెప్పడంతో తెజస వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలతోనే కోదండరాం సీపీఐ నేతలను కలిసి ఈ అంశాలన్నింటిపైనా చర్చించినట్లు తెలుస్తోంది.
Tags: Stopping the Kagamatyam seat seat adjustment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *