నిబంధనలను పాటించని ఐటీఐలపై కఠిన చర్యలు

Strict actions against ITIs who do not follow the rules

Strict actions against ITIs who do not follow the rules

Date:14/08/2018
సచివాలయం ముచ్చట్లు:
నిబంధనలను పాటించని ఐటీఐలను గుర్తించి తక్షణమే వాటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా అందిస్తున్న శిక్షణల్లో ఆయా కంపెనీల అవసరాలకనుగుణంగా నిరుద్యోగ యువతకు ట్రయినింగ్ ఇవ్వాలని స్పష్టంచేశారు.  ఐటీఐల్లో విద్యార్థులకు ఉపాధి కల్పించే ట్రేడ్లు నిర్వహించాలన్నారు. ఈ కోర్సులు స్థానిక పరిస్థితులు, అవసరాలకనుగుణంగా ఉండాలన్నారు.
సచివాలయంలోని తన కార్యాలయంలో లేబర్, ఎంప్లాయిమెంట్, ఎ.పి.ఎస్.ఎస్.డి.సి., సీడ్ యాప్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా జాబ్ మేళాల ద్వారా యువతకు కల్పిస్తున్న ఉద్యోగాల వివరాలను స్పెషల్ సీఎస్ జె.ఎస్.వి. ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్ కు వివరించారు.  నేషనల్ అప్రెంటీషిప్ ప్రమోషన్ స్కీమ్(ఎన్.ఎ.పి.ఎస్.) ద్వారా దేశ వ్యాప్తంగా 50 లక్షల మంది ఐటీఐ విద్యార్థులకు వివిధ కంపెనీల్లో శిక్షణివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఇందుకోసం నేషనల్ అప్రంటీషిప్ పోర్టల్ ప్రారంభించిందన్నారు. దీనిలో విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకుంటే, వారికి శిక్షణ అందిస్తోందన్నారు. రాష్ట్రంలో 84 వేలకు పైగా విద్యార్థులకు అప్రంటీషిప్ ద్వారా శిక్షణివ్వనున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలలో రెండు పర్యాయాలు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. వేల సంఖ్యలో విద్యార్థులకు జాబ్ మేళాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగరమాల ప్రాజెక్టులో పనిచేయడానికి అవసరమైన స్కిల్ ను నిరుద్యోగ యువతకు అందిస్తున్నామన్నారు.
రిటైల్ స్కిల్ ప్రొగ్రామ్ కింద ఆన్ లైన్ ద్వారా వ్యాపారాలు నిర్వహించే రిటైల్ సంస్థల్లో పనిచేయడానికి అవసరమైన శిక్షణను అందిస్తున్నట్లు సీఎస్ దినేష్ కుమార్ కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్ వివరించారు. ఎస్.ఇ.ఇ.డి.ఎ.పి. ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే విద్యావంతులకు ఉద్యోగ కల్పన కోసం స్కిల్ డవలప్ మెంట్ కింద శిక్షణ అందజేస్తున్నామన్నారు. ఎ.పి.ఎస్.ఎస్.డి.సి. ద్వారా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నట్లు సీఎస్ దినేష్ కుమార్ కు పవర్ పాయింట్ ద్వారా ఆ సంస్థ ఎం.డి. కె.సాంబశివరావు వివరించారు. ఇండస్ట్రీస్ సర్టిఫికెట్ కోర్సు, సీమెన్స్ సెంటర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 40 సీమెన్స్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. దీనిద్వారా ప్రైవేటు సంస్థలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్ అర్హత కలిగిన లక్షమందికి సీమెన్స్ కేంద్రాల శిక్షణివ్వనున్నామన్నారు. ఇప్పటికే 50,434 మందికి శిక్షణ అందిస్తున్నామన్నారు.
అనంతరం సీఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు శిక్షణా కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు అందించాలన్నారు. ఇంత వరకూ ఎంతమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు…వారి పేర్లు, వారు అందుకుంటున్న వేతనాల వివరాలతో కూడిన పోర్టల్ ను రూపొందించాలన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఎవరెవరికి ఉద్యోగాలిచ్చిందో స్పష్టమైన వివరాలు లభ్యమవుతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఐటీఐల్లో అధిక శాతం నిరుపయోగమైన కోర్సులు ఉన్నాయన్నారు. ప్రస్తుత అవసరాలకనుగుణమైన ట్రేడ్లను ఐటీఐల్లో ప్రవేశపెట్టాలన్నారు.
వాటిలో ప్రాథమిక రంగానికి కూడా ప్రాధాన్యమివ్వాలన్నారు. పలు ఐటీఐలు పేరుకు ఉన్నాయని, వాటిలో కోర్సులున్నా అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండడలేదన్నారు. దీని వల్ల విలువైన కాలాన్ని విద్యార్థులు కోల్పోవడంతో పాటు సర్టిఫికెట్లు తప్ప వారిలో నైపుణ్యం కొరవడుతోందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో విస్తృతంగా ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో వారికి అవకాశాలు లభించడం లేదన్నారు. తక్షణమే రాష్ట్రంలో ఉన్న ఐటీఐ తనిఖీలు నిర్వహించి, బోధన సరిగ్గాలేని, మౌలిక వసతులు, పరికరాలు అందుబాటులో ఉంచని గుర్తించి, వాటిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఐటీఐల ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. వాటిలో లేటెస్ట్ పరికరాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ ల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారి సంఖ్య తనకు అందించాలన్నారు. వచ్చే సమావేశానికి పూర్తి స్థాయి వివరాలతో రావాలని లేబర్, ఎంప్లాయిమెంట్ అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలతో స్కిల్ డవలప్ మెంట్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఆయా పరిశ్రమలకు అవసరమైన శిక్షణలను విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు అందజేసి, వారి వివరాలను ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ అధికారులకు అందించాలన్నారు. వారు ఆయా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి, శిక్షణపూర్తి చేసుకున్నవారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు. ఈ సమావేశంలో లేబర్, ఎంప్లాయిమెంట్ శాఖ కమిషనర్ వరప్రసాద్, ఎస్.ఇ.ఇ.డి.ఎ.పి. సీఈవో వరప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags:Strict actions against ITIs who do not follow the rules

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *