మహిళా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే శాఖా పరమైన కఠిన చర్యలు -ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,
➡️ మహిళా సంబంధిత ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే శాఖా పరమైన కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులకు హెచ్చరిక. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వెంటనే విచారించి పరిష్కరించాలి.
➡️ రౌడీ, హిస్టరీ షీటర్లు ప్రమేయం ఉన్న కేసులను యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ నమోదు చేయాలి. డీఎస్పీల పర్యవేక్షణ ఉండాలి.
➡️ రౌడీ, హిస్టరీ షీటర్ల PT కేసులకు సంబంధించి డిఎస్పీలు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై కోర్టు విచారణ త్వరగా పూర్తి గావించి, షీటర్లకు శిక్ష పడేటట్లు కృషి చేయాలి.

➡️ NDPS కేసులలో ప్రమేయం ఉన్న వినియోగదారులు, విక్రేతల ద్వారా సమాచారం సేకరించి మాదకద్రవ్యాల నెట్వర్క్ ను చేదించాలి.
➡️ జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ లకు తావు లేదు. ప్రత్యేక బృందాలతో క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై నిరంతర నిఘా ఏర్పాటుచేసి యువత పక్కదోవ పడకుండా చర్యలు.
➡️ ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచినప్పుడే శాంతి భద్రతలు, నేరస్తులను అదుపు చేయడం సాధ్యం.
➡️ ప్రభుత్వ ఆస్తికి భంగం కలిగించే విధంగా రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకోవాలి.
➡️ రాబోవు కాలంలో ఎన్నికలు ఉన్నందున పోలీసు అధికారులు సిబ్బంది ఎక్కడా కూడా రాజకీయంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదు..ఎలాంటి పక్షపాత ధోరణి అవలంబించరాదు..రాజకీయాలకు అతీతంగా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాలి.
➡️ ర్యాగింగ్ ను సమూలంగా ప్రక్షాళన చేయాలి..తరచూ కాలేజీలలో కౌన్సిలింగ్ నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించాలి.
➡️ దసరా సెలవుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా దొంగతనాలు జరగకుండా నివారణ చర్యల్లో భాగంగా ఊర్లకు వెళ్లే ప్రజలు తమ ఇళ్లలో పోలీస్ శాఖ అందిస్తున్న ఉచిత LHMS కెమెరాలను అమర్చుకునే విధంగా విస్తృతంగా ప్రజలకు ప్రచారం చెయ్యాలి.
తిరుపతి ముచ్చట్లు:
బుధవారం నాడు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సావేరి అతిథి గృహం సమావేశ మందిరం నందు జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., అధ్యక్షతన నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ గారు ప్రతి పోలీస్ స్టేషన్ల వారీగా నమోదు అవుతున్న కేసుల స్థితిగతులను PPT ద్వారా తెలుసుకొని, సమీక్షించారు. అన్ని రకాల కేసులను త్వరితగతిన ఎలా పరిష్కరించాలనే మెలకువలను గురించి పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ముఖ్యంగా మహిళా సంబంధిత ఫిర్యాదులు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వాటికి మొదటి ప్రాధాన్యతగా స్వీకరించి ఆ ఫిర్యాదును సత్వరమే విచారించి, పరిష్కరించాలి. ఈ ఫిర్యాదులను అత్యంత సున్నిత మైనదిగా భావించి విచారించాలి. అవసరమైనప్పుడు కేసు నమోదు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ల యందు మహిళా సంబంధిత ఫిర్యాదుల విషయంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా అలసత్వం వహించారని నా దృష్టికి వస్తే మరో మాట లేకుండా శాఖాపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటానని పోలీస్ అధికారులను ఎస్పీ గారు హెచ్చరించారు.కేసులు నమోదు చేస్తే సరిపోదని, శ్రద్ధ వహించి దర్యాప్తు చేయాలి. క్రైమ్ పోలీసులు ఇంకా మెరుగైన ఫలితాలను రాబట్టి, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులు అలా ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని కారణాలను తెలుసుకొని సమగ్రమైన దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్., ప్రయారిటీ PT కేసుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎస్సై నుండి డిఎస్పి స్థాయి వరకు తీసుకున్న ప్రియారిటి PT కేసులలో ముద్దాయిల బెదిరింపుల నుండి సాక్షులను, బాధితులను నిరంతరం కాపాడుకుంటూ కోర్టు నందు త్వరగా విచారణ పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుని, సదరు ముద్దాయిలకు శిక్ష పడేటట్లు చేసినప్పుడే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. కానీ చాలామంది పోలీస్ అధికారులు ప్రయారిటి పీటీ కేసుల విషయంలో కోర్ట్ కానిస్టేబుల్ పై ఎక్కువగా ఆధారపడి పనిచేస్తున్నారని ఈ పద్ధతిని కచ్చితంగా మార్చుకోవాలని హితవు పలికారు.రౌడీ హిస్టరీ షీటర్ల ప్రమేయం ఉన్న కేసులను యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తు పూర్తిచేసి 30 రోజుల్లోపు కోర్టులో చార్జి షీటు నమోదు చేయాలన్నారు..రౌడీ, హిస్టరీ షీటర్ల పై ఉన్న PT కేసులను ప్రాముఖ్యత కలిగిన కేసులుగా భావించి సంబంధించి SDPO లు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై న్యాయాధికారులతో మాట్లాడి కోర్టు విచారణ త్వరగా పూర్తి చేసి, సదరు షీటర్లకు శిక్షపడేటట్లు కృషి చేయాలన్నారు.సమన్లు, వారెంట్లు ను సకాలంలో సంబంధిత వ్యక్తులకు ఖచ్చితంగా అందజేసి, కోర్టు విచారణకు తప్పనిసరిగా హాజరయ్యేటట్లు సదరు SHOలు భాద్యతలు తీసుకోవాలని, కోర్టు విచారణ సమయంలో సాక్షులను ముందుగా తర్ఫీదు చేయడం ద్వారా వారు ధైర్యంగా సాక్ష్యం చెప్పగలుగుతారన్నారు. కోర్టు విచారణకు బాధితులు, ముద్దాయిలు, సాక్షులు, సాక్షాధారాలతో కూడిన దర్యాప్తు అధికారి తప్పనిసరిగా హాజరు కావాలి. అదే రోజు కోర్టు విచారణ పూర్తి అయ్యి, తీర్పు నిలబడే అవకాశం ఉంటుందన్నారు.
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ప్రారంభమైన తరుణంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లపై ప్రత్యేక బృందాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపించి అమాయక ప్రజలు, యువతను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ ఊబిలోకి లాగితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.NDPS కేసులలో ప్రమేయం ఉన్న వినియోగదారులు, విక్రేతల ద్వారా సమాచారాన్ని సేకరించి వారి యొక్క నెట్వర్క్ ను చేదించాలని, విద్యార్థులు ఎవరైనా ఈ వ్యవహారంలో అనుమానం ఉన్నట్లు సమాచారం ఉంటే వారికి తరచుగా కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో మంచి పరివర్తన వచ్చేటట్లు చర్యలు తీసుకోవడం ద్వారా విద్యార్థులకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామన్నారు.దొంగతనాల విషయంలో జిల్లా పోలీసు యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తే కుదరదని, క్రైమ్ డిటెక్షన్ శాతం, ప్రాపర్టీ రికవరీ శాతాలను గణనీయంగా పెంచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. తరచూ నేరాలు జరిగే ప్రాంతాలలో ఈ-బీట్ సిస్టం ను బలోపేతం చేయాలన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనబడుతున్నదన్నారు. ఈ విషయంలో నేర నియంత్రణపై శ్రద్ధ వహించి, నేరస్థులను కట్టడి చేయకపోతే సంబంధిత SHOలపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటానన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు గతంలో అవలంబించిన ప్రణాళికను సమీక్షించుకుని, నేటి పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని, జాతీయ రహదారుల లో బ్లాక్ స్పాట్లను గుర్తించి అవసరమైన సూచిక బోర్డులను, బ్లింకింగ్ సిగ్నలింగ్ సిస్టంను ఏర్పాటు చేసి నిరంతరం హైవే పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ తిరగాలన్నారు. రహదారి భద్రత సూత్రాల గురించి తరచుగా SDPO లు వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తుండడం వలన సదరు డ్రైవర్లు తమ బాధ్యతలు గుర్తెరిగి అప్రమత్తంగా వాహనాలను నడుపుతారు. పోలీసుల కౌన్సిలింగ్ వలన కనీసం ఒక కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం బారిన పడకుండా కాపాడినా కూడా వారికి మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం మనమే అవుతామని జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., సూచించారు డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్., ఆదేశాల మేరకు గత నెలలో ప్రియారిటి PT కేసుల విధానం ద్వారా ఎక్కువ కేసులను నిరూపించి, నేరస్థులకు శిక్ష పడేటట్లు విశేష కృషి చేసిన చంద్రగిరి సబ్ డివిజన్ తిరుచానూరు పోలీస్ స్టేషన్ సీఐ శివప్రసాద్ రెడ్డి మరియు సిబ్బందికి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,ప్రశంసా పత్రాలను అందించి, అభినందించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు పరిపాలన వెంకటరావు, శాంతిభద్రత కులశేఖర్, నేర విభాగం విమల కుమారి, సెబ్ రాజేంద్ర, ఎస్బి డిఎస్పి గిరిధర, జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మరియు ప్రశంసా పత్రాలు పొందిన సిబ్బంది పాల్గొన్నారు.
Tags:Strict departmental action will be taken if the complaints of women are negligent – SP P. Parameswara Reddy IPS.,
