ఠీవీగా పీవీ విగ్రహం

హైదరాబాద్    ముచ్చట్లు :

భారత మాజీ ప్రధాని.. బహుభాష కోవిదుడు పీవీ నరసింహారావు పేరుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఆయన భారీ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున సుందరంగా ఏర్పాటు చేస్తోంది. హుస్సేన్‌సాగర్‌ తీరంలో నెక్లెస్‌రోడ్‌ను పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌గా మార్చిన ప్రభుత్వం..రోడ్డుకు వెళ్లే ప్రవేశం వద్ద 16 అడుగుల ఎత్తుతో, 2 టన్నుల బరువుతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం తుదిదశ పనులు చురుగ్గా సాగుతుండగా, ఈనెల 28న పీవీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపడుతున్నారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ), సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ రోటరీ ఎదురుగా పీవీ స్టాచ్యూ ఐస్‌ల్యాండ్‌ పేరుతో పనులు నిర్వహిస్తున్నారు.హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఏర్పాటు చేస్తున్న భారీ పీవీ విగ్రహం చుట్టూ సుమారు అరెకరం విస్తీర్ణంలో ఆకర్షణీయంగా ల్యాండ్‌ స్కేపింగ్‌ను తీర్చిదిద్దుతున్నారు. ట్రయాంగిల్‌ ఆకారంలో స్థలాన్ని పచ్చని మొక్కలతోపాటు విగ్రహానికి ఇరువైపులా మట్టిని వంపులు తిరిగిన రూపంలో చూడచక్కగా మలుచుతున్నారు. విగ్రహం చుట్టూ ఫోకల్‌ ట్రీలు, సాగర్‌ను ఆనుకొని నడకదారి ఫెన్సింగ్‌ను ఇనుపగ్రిల్స్‌తో చక్కగా ఏర్పాటు చేస్తున్నారు.పీవీ పేరుకు తగ్గట్టుగా నెక్లెస్‌రోడ్డు ప్రధానమార్గంలోనే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం ఉన్న రోటరీ ఎదురుగా 2 టన్నుల బరువుతో 16 అడుగుల ఎత్తున విగ్రహాన్ని పడమర అభిముఖంగా ప్రతిష్ఠిస్తున్నారు. విగ్రహం తయారీలో 85 శాతం కాపర్‌, జింక్‌, టిన్‌, లెడ్‌ను 5 శాతం చొప్పున కలిపారు. సుమారు రూ.27 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహాన్ని 15 మంది కళాకారులు 17 రోజుల్లో రూపొందించగా, మంగళవారం భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించే స్థలానికి తీసుకొచ్చారు. దిమ్మెను మార్బుల్స్‌తో అతి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Strictly Peewee statue

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *