తిరుమల నడక మార్గాల్లో మరింత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు- టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి
– నడక దారుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి
– 500 సిసి కెమెరాలు ఏర్పాటు
– నడక మార్గాలను సత్వరంగా మూసి వేసేందుకు సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తాం

తిరుమల ముచ్చట్లు:
అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరింత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ, అటవీ పోలీస్ అధికారులతో ఈవో అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చాలా బాధాకరమన్నారు. నడకమార్గంలో 500 సిసి కెమెరాలు ఏర్పాటు చెస్తామని చెప్పారు. నడక మార్గానికి ఇరువైపులా కంచె ఏర్పాటు చేసేందుకు సమగ్ర నివేదిక అందించాలని డి.ఎఫ్.ఓ ను ఆదేశించారు.చిరుత దాడి ఘటనపై సిసిఎఫ్ శ్రీ నాగేశ్వరరావు అధ్వర్యంలో సీన్ రీకనస్ట్రక్సన్ చెయ్యించి, చిరుతను బంధించడం కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నడకదారిలో ఇప్పటికే 30 మంది టీటీడీ భద్రత సిబ్బంది, 10 మంది ఫారెస్ట్ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. రెండు నడక మార్గాల్లో
పారెస్టు, పోలీస్, టీటీడీ కలిసి మరింత ఎక్కువ మందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.100 మంది భక్తుల గుంపుకు సేక్యూరిటి సిబ్బందిని ఏర్పాటు చేసి అనుమతించనున్నట్లు చెప్పారు. నడకదారులలో మధ్యాహ్నం 2-3 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించే అంశాలపై సాధ్యా సాధ్యాలనుపరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా వుండేందుకు, త్వరలో అటవీ శాఖ అధికారులు అందించే నివేదిక ఆధారంగా పటిష్టమైన భద్రత చర్యలు చేపడతామని ఆయన వివరించారు.చిన్నపిల్లలతో నడక మార్గాల్లో వచ్చే తల్లితండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఈవో విజ్ఞప్తి చేశారు.
సిసిఎఫ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ట్రాంక్విలైజర్స్, బోన్లు వినియోగించి నడక మార్గాల్లో సంచరించే వన్య మృగాలను బంధించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ సమావేశంలో ఎస్ ఈ -2 జగదీశ్వర్ రెడ్డి, తిరుమల ఏఎస్ పి ముని రామయ్య, డిఇ ఎలక్ట్రికల్ రవి శంకర్ రెడ్డి, డిఎఫ్ ఓ శ్రీనివాసులు, విజివోలు బాల్ రెడ్డి, గిరిధర్, మనోహర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags:Stronger security arrangements on Tirumala walkways- TTD EO AV Dharma Reddy
