విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరేందుకు నిర్దిష్టమైన లక్ష్యాలు ఏర్పరచుకోవాలి -టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి
తిరుమల ముచ్చట్లు:
విద్యార్థినీ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరేందుకు విద్యార్థి దశలోనే నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, చక్కటి ప్రణాళికతో లక్ష్యాలను సాధించుకోవాలని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి కోరారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలను సోమవారం ఉదయం ఈవో సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ఈవో ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిరంతరం గుర్తు పెట్టుకోవాలని, జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిరాశ చెందకూడదని చెప్పారు. అకుంఠిత దీక్ష, శ్రమతో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చన్నారు. ఈ సందర్భంగా “సాధనమున పనులు సమకూరు ధరలోన..” అనే పద్యాన్ని విద్యార్థులకు విపులీకరించారు. ఇందుకు ఉదాహరణగా ఏకలవ్యుడి కథను వివరించారు. అదేవిధంగా, భగవద్గీతలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఉదహరించారు. మంచిస్థాయికి ఎదిగేందుకు క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు. భగవంతుని కన్నా ముందు మన తల్లిదండ్రులను గుర్తుంచుకోవాలని, మన భవిష్యత్తుకు మార్గనిర్దేశనం చేసేది తల్లిదండ్రులు, గురువులు మాత్రమేనని చెప్పారు. పరిశుభ్రతే దైవమని గాంధీజీ బోధించారని, ఆ ప్రకారం మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులు నెలకు రెండుసార్లు శ్రమదానం చేసి కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

అనంతరం కళాశాలలోని బొటనీ, ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ పరిశోధనశాలలను ఈవో పరిశీలించారు. కళాశాల వెనుక భాగంలో ఉన్న వ్యర్థాలను తొలగించి పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కళాశాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, తగినంతమంది సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని జెఈవోను కోరారు .ఈవో వెంట జెఈవో సదా భార్గవి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ(ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, విద్యాశాఖ అధికారి శ్రీ గోవిందరాజన్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డా. వేణుగోపాల్‌రెడ్డి, అధ్యాపకులు ఉన్నారు.
Tags:Students should set specific goals to reach higher level -TTD EO AV Dharma Reddy
