Natyam ad

ఘనంగా రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి శ్రీ కోదండరామాలయంలో కొలువైన శ్రీ సీతారాములు, లక్ష్మణస్వామి వారికి శ‌నివారం రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం ఘనంగా జరిగింది.ఉదయం 8.45 నుండి 9.30 గంటల వరకు శ్రీ కోదండరామాలయం నుండి శ్రీ సీతారాముల సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను పాత ప్రసూతి ఆసుపత్రి రోడ్డులోని రేపాకుల సుబ్బమ్మ తోట(ఆర్‌ఎస్‌ గార్డెన్స్‌)కు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఆస్థానం, నివేదన నిర్వహించారు.సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు రాత్రి 7 గంటలకు శ్రీ కోదండరామాలయానికి చేరుకుంది.

 

 

శ్రీకోదండరామస్వామికి రేపాకుల సుబ్బమ్మ అపర భక్తురాలు. ఈమె వందేళ్ల క్రితం స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించేవారు. 1910వ సంవత్సరం నుండి కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహన సేవలను సొంత ఖర్చులతో నిర్వహించేవారు. తన తదనంతరం కూడా ఈ సేవలు కొనసాగాలనే తలంపుతో 1933వ సంవత్సరంలో కొంత స్థలాన్ని కోదండరామాలయానికి విరాళంగా అందించారు. ఈ భూమిలోనే ప్రస్తుతం ఎస్వీ బాలమందిరం, ఆర్‌ఎస్‌ గార్డెన్స్‌ ఉన్నాయి. కోదండరాముని భక్తురాలైన రేపాకుల సుబ్బమ్మ కోరిక మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తోంది.ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో నాగ‌ర‌త్న‌, ఏఈవో  పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్  సోమ‌శేఖ‌ర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు  సురేష్‌,  చ‌ల‌ప‌తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Subbamma garden festival of rapeseeds

Post Midle