విజయవంతంమైన హరిత పాఠశాల- హరిత తెలంగాణ 

-రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటిన విద్యార్థినీ విద్యార్థులు
-హరిత పాఠశాలలో పాల్గొన్న మంత్రులు, కలెక్టర్లు, ఆయా జిల్లాల ఉన్నతాధికారులు
-సమన్యయంతో హరిత పాఠశాలను విజయవంతం చేసిన అటవీ, విద్య, గ్రామీణాభివృద్ది శాఖలు
Date:25/08/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
హరిత పాఠశాల-హరిత తెలంగాణ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు హరిత తెలంగాణ కార్యక్రమంలో పాల్గొని తమ విద్య సంస్థల ఆవరణల్లో మొక్కలు నాటారు. ఆయా ప్రాంతాల్లో గ్రీన్ ర్యాలీలు నిర్వహించి తెలంగాణకు హరితహారం ఉద్దేశ్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు.
పర్యావరణ పరిరక్షణ, తద్వారా మానవ జీవితానికి ప్రకృతితో ఉన్న బంధాన్ని వివరిస్తూ  విద్యార్థులే వారధులుగా రోజంతా కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో జరిగాయి. ప్రతీ జిల్లాలోనూ మంత్రులు, కలెక్టర్, డీఈఓ, డీఎఫ్ఓతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా పలు విద్యాసంస్థల్లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మొక్కలు నాటడంతో పాటు, ర్యాలీల నిర్వహణ, అలాగే ప్రత్యేక సమావేశాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి ఇస్తున్న ప్రాధాన్యత, మొక్కల రక్షణలో  సమాజంలోని పౌరుల పాత్రపై వివరించారు. దాదాపు అన్ని జిల్లాల్లో మానవహారాలు, పర్యావరణ పరిరక్షణతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
వరంగల్ రూరల్ జిల్లా, సంగెం మండలం గవిచెర్ల మోడల్ స్కూల్ లోఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అదిలాబాద్ జిల్లాలో జరిగిన హరిత పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చల్లూరు, జమ్మికుంటల్లో హరిత పాఠశాల కార్యక్రమంలో పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి  ఎఎస్డీ ప్రియాంక వర్గీస్ నిజామాబాద్ జిల్లాలో పాల్గొన్నారు.
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, మోడల్ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లు ఇలా అన్ని విద్యాసంస్థల ప్రాంగణాల్లో ప్రత్యేకంగా గుర్తించిన ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. పిల్లలకు నీడను ఇచ్చే మొక్కలతో పాటు పూలు, పండ్ల మొక్కలను కూడా నాటేలా అటవీ శాఖ చర్యలు తీసుకుంది.
అలాగే తమ ఇళ్లల్లో పెంచుకునేందుకు వీలుగా విద్యార్థులు, తల్లిదండ్రులు కోరిన మొక్కలను కూడా అందించారు. కనీసం అర ఎకరం, ఆపై బడిన విద్యాసంస్థల ప్రాంగణాల్లో నాటే మొక్కల సంరక్షణకు ఉపాధి హామీ నిధులతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనిలో భాగంగా వందకు లోపు మొక్కలు ఉన్న చోట ఆ విద్యా సంస్థే రక్షణ చర్యలు చేపట్టడం, వంద మొక్కలు పైబడి నాటిన చోట ఉపాధి హామీ నిధులతోనే రక్షణ కంచె ఏర్పాటు, కాపలాదారును నియమించటం, ప్రత్యేకంగా నీటి వసతి ఏర్పాటు చేస్తున్నారు.
గత మూడు హరితహారాల్లో కూడా విద్యాసంస్థల్లో నాటిన మొక్కలు బతికిన శాతం ఎక్కువగా ఉండటంతో ఈ సారి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అన్ని విద్యాసంస్థల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంది.
Tags; Successful Green School – Green Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *