Sugalimitta is the epitome of problems in the bigotry

సుగాలిమిట్ట పెద్దతాండలో సమస్యల తిష్ట

– నీటి కోసం ఇక్కట్లు
– రహదారిలేక అవస్థలు
– పత్తాలేని పారిశుద్ధ్యం

Date:23/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

గిరిజనులకు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో సమస్యల వలయంలో జీవనం సాగిస్తున్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేయడంతో గిరిజనుల ముంగిట సమస్యలు తిష్ట వేశాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలం సుగాలిమిట్ట పెద్దతాండలో సుమారు 800 మంది నివశిస్తున్నారు. ఎక్కువ భాగం గిరిజనులు కూలీ పనులకు వె ళ్లి జీవనం సాగిస్తుంటారు.ప్రజలకు , విద్యార్థులకు సరైన వసతులు లేక సమస్యలలో జీవనం సాగిస్తున్నారు. ఈ విషయమై మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే చర్యలు తీసుకుని గిరిజనులకు వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా గ్రామంలోని యువకులు అంతా కలసి మనవిలేజ్‌ న్యూస్‌ పేరుతో గ్రూపు తయారు చేసి , సోషియల్‌ మీడియా ద్వారా ప్రజాప్రతినిధులకు , అధికారులకు సమస్యలు విన్నవించేందుకు శ్రీకారం చుట్టారు.

నీటి సమస్య….

గ్రామంలో నాలుగు మంచినీటి బోర్లతో పాటు నూతన ఓవర్‌హెడ్‌ ట్యాంకును ఆరు సంవత్సరాల క్రితం సుమారు రూ.20 లక్షల ఖర్చుతో నిర్మించారు. దీని ద్వారా గ్రామంలోని ప్రజలకు మంచినీటి 30 కొళాయిలు ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఏడాది కూడ కాకనే నూతన ట్యాంకుకు పైపులు పెరికివేశారు. పాత నీటి ట్యాంకు ద్వారానే నేటికి చాలిచాలని నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఒక బోరు మాత్రమే పని చేయడంతో గ్రామస్తులు సమీపంలోని వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

వసతులు కరువు….

గ్రామానికి రోడ్డు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అలాగే గ్రామంలోని వీధులకు సిమెంటు రోడ్లు, కాలువలు లేకపోవడంతో పారిశుద్ధ్యం పత్తాలేకుండ పోయింది. సుగాలిమిట్ట పెద్దతాండాలో ఏటు చూసినా మురుగునీటి కాలువలు, చెత్త దిబ్బలు , ముళ్లపొదలు స్వాగతం పలుకుతాయి. విద్యుత్‌ దీపాలను వెలిగించే నాధుడే లేకపోయారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న అధికారుల నిర్లక్ష్యం కారణంగా గిరిజనతాండా అభివృద్ధికి నోచుకోలేదు.

ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయాలి …

గిరిజన విద్యార్థుల కోసం ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరవ తరగతి చదివేందుకు ఉన్నత పాఠశాలలకు వెళ్లాలంటే పుంగనూరు, మదనపల్లెకు వెళ్లాల్సి ఉంది. పేదరికంలో ఉండి, వసతులు లేకపోవడంతో సుమారు 120 మంది విద్యార్థులు ప్రతి రోజు బయట ప్రాంతాలకు వెళ్లి చదువుకుని ఇంటికొస్తున్నారు. ఇలాంటి సమయంలో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందనిద్రాక్షపండులా మారింది.

ఎంపీడీవో వివరణ….

ఈ విషయమై పుంగనూరు ఎంపీడీవో లక్ష్మీపతినాయుడును విచారించగా తక్షణమే సుగాలిమిట్ట పెద్దతాండను సందర్శించి సమస్యలను పరిశీలించి నివేదికలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందజేసి పరిష్కరిస్తామన్నారు. నీటి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు.

మంత్రి పెద్దిరెడ్డి చర్యలు తీసుకోవాలి…

సుగాలిమిట్టపెద్దతాండలో సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమైయ్యారు. గ్రామంలోని మంచినీటి ట్యాంకుకు నీటిని వదిలి , కొళాయిల ద్వారా నీటిని సరఫరా చేయాలి.అలాగే గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తక్షణమే చర్యలు తీసుకుని , గిరిజనులను ఆదుకోవాలి . గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు గ్రూపు ఏర్పాటై, గ్రూపు ద్వారా ప్రజా ప్రతినిధులకు , అధికారులకు సమస్యలు తెలిపేలా చర్యలు తీసుకున్నాం.

– ఎం.పవన్‌నాయక్‌, సీఏ విద్యార్థి, సుగాలిమిట్ట.

గిరిజనులను నిర్లక్ష్యం చేస్తున్నారు….

గిరిజనతాండాలలో సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు అర్జీలు ఇచ్చినా స్పందన మాత్రం కానరాలేదు. ప్రభుత్వం గిరిజనులకు ఇస్తున్న నిధులను సకాలంలో ఖర్చు చేసినా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఈ విషయమై మంత్రి పెద్దిరెడ్డి చర్యలు తీసుకుని, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలి.

– పి.మహేష్‌కుమార్‌నాయక్‌, గ్రామస్తుడు, సుగాలిమిట్ట .

గిరిజనుల సమస్యలపై పోరాటం…

గిరిజన తాండాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు గిరిజనుల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తాం. ప్రభుత్వం గిరిజనులకు కేటాయిస్తున్న నిధులు, సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండ యువత ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నాం. మా ఊరిని బాగు చేసుకునేందుకు మేము భాగస్వామ్యులౌతాం.

– బి.చంద్రకుమార్‌నాయక్‌, విద్యార్థి, సుగాలిమిట్ట

తొండ‌మనాడులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tags: Sugalimitta is the epitome of problems in the bigotry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *