Natyam ad

సంక్షోభంలో చెరుకు రైతులు

విజయవాడ ముచ్చట్లు:


ఆంధ్రప్రదేశ్‌ చెరకు సాగుచేసే రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయారు. ఏడాదికోసారి చేతికొచ్చే పంట చెరకు. ఏడాదంతా కష్టపడి పండించి, మిల్లులకు సొంత ఖర్చులతో చెరకును చేరవేసిన రైతుకు రెండేళ్లుగా ఫ్యాక్టరీల యాజమాన్యాలు డబ్బులివ్వకుండా వేధిస్తున్నాయి. విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లోని రైతులకు రూ.200 కోట్లు అందాల్సి ఉంది. ఇటువంటి ఘటనలను పరిష్కరించేందుకు షుగర్‌కేన్‌ కంట్రోల్‌ చట్టం-1956 ఉన్నా… తమకు ఏమీ సంబంధం లేదనేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండటం రైతులను మరింత నష్టాల్లోకి, అప్పుల ఊబిలోకి దించుతోంది. 2006-07 నాటికి ఎపిలో 29 చక్కెర ఫ్యాక్టరీలు పనిచేస్తే, వాటి సంఖ్య ప్రస్తుతం 6కు పడిపోయింది. దేశవ్యాప్తంగా చెరకు విస్తీర్ణం ఈ ఏడాది పెరిగిందని, ఎపిలో మాత్రం గణనీయంగా పడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి గల కారణాలను ప్రభుత్వమే విశ్లేషించుకోవాల్సి ఉంది.

 

 

 

ఇతర రాష్ట్రాలన్నీ ఏటా చక్కెర పాలసీని ప్రకటించడంతోపాటు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా కొంత మద్దతు ధరను ఇస్తూ రైతులకు అండగా నిలబడుతున్నాయి. ఎపిలో కేంద్రం ఇచ్చే మద్దతు ధరనే ఇవ్వాల్సి ఉండడంతో రైతులకు కేంద్రం ఇచ్చే గిట్టుబాటు ధర సరిపోక ఈ పంటను వదిలి, వేరే పంటలను సాగుచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం టన్నుకు రూ.2,750 మాత్రమే మద్దతు ధర ఇస్తోంది. రైతుకు మాత్రం దీనిని మించి ఖర్చులవుతున్నాయి. పెరుగుతున్న నిత్యావసరాలు, ఇంధనం ధరలకు అనుగుణంగా కేంద్రం మద్దతు ధరలు పెంచకపోవడం రైతులకు నష్టం కలగడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు కేంద్రం మద్దతు ధర నిర్ణయిస్తే రైతులకు గిట్టుబాటవుతుంది. కేంద్రం దానిపై దృష్టి పెట్టడం లేదు. కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాలు చెరకు రైతులను ఆదుకునేందుకు చెరకు పంట తీయడం, ఫ్యాక్టరీలకు తరలించడానికి అవసరమయ్యే ఖర్చులన్నీ భరిస్తూ, రైతులకు మద్దతు ధర ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి.

 

 

Post Midle

2020-21 చెరకు సీజన్‌లో ఎపిలో లక్ష ఎకరాల్లో చెరకు పంట సాగైతే, 2021-22 సీజన్‌కు 40 వేల ఎకరాల్లోనే చెరకు పంట సాగైంది. చెరకు ఫ్యాక్టరీ ఏడాదిలో 150 రోజులు పనిచేయాలి, దానికి కావాల్సినంత చెరకు ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఫ్యాక్టరీ పనిచేయాలన్నా వాటికి కేవలం 40-50 రోజులు పనిచేసేందుకే చెరకు సాగైంది. దీంతో ప్రస్తుతమున్న చెరకు ఫ్యాక్టరీలు, వాటిలో పనిచేసే కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తమకు రావాల్సిన బకాయిలను తక్షణమే ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Tags: Sugarcane farmers in crisis

Post Midle