ఆక్వాపై సమ్మర్ ఎఫెక్ట్

Date:13/03/2018
ఏలూరు ముచ్చట్లు:
వేసవిరాకుండానే ప్రచండభానుడి ప్రతాపానికి ఆక్వా రంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ ఉష్ణోగ్రతలకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉందోనని ఆక్వా రైతులు భయకంపితులవుతున్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతుకు ఎదురులేని దెబ్బతగిలినట్లేనని చెప్పవచ్చు. ఫలితంగా ఆక్వా ఉత్పత్తులు మృత్యువాతపడటమేకాకుండా ఆ ప్రభావం విదేశీ ఎగుమతులపై ఎక్కువగా పడనుంది.ఈ ఏడాది జనవరి మాసం శివారు, ఫిబ్రవరి మాసాల్లో రాష్ట్రంలోని ఆక్వా రైతులు డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సీడ్‌ను వేశారు. ఈ పంట 90 రోజులకు చేతికి వస్తోంది. అయితే చలితీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సమయాన్ని చూసుకుని సీడ్ వేశారు. ఇప్పుడిప్పుడే రొయ్య పిల్లలు సైజులకు వస్తున్నాయి. సరిగ్గా మార్చి మాసం ప్రారంభమైన పక్షం రోజులు కూడా గడవకముందే భానుడి భగభగలు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఆక్వా ఉత్పత్తులు ఉత్పత్తి చేసి, సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ పగటి ఉష్ణోగ్రతల ప్రభావం ఆక్వా ఉత్పత్తులపై ఎక్కువగాపడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జనవరి మాసంలో చెరువుల్లో సీడ్ వేసిన రైతులు పట్టుబడులకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మంచి దిగుబడి వస్తోందని భావిస్తున్నారు. ఇక వెనుక వేసిన చెరువుల యజమానులు ఆశలు వదులుకోవాల్సిందేనేమోనని భావిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా మన రాష్ట్రంలో పండించిన ఆక్వా ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్న నేపధ్యంలో మంచి దిగుబడులు అంటే మంచి కౌంట్లు వస్తే ఆదాయం బాగుండటమేకాకుండ వారి ఆశలు చిగురిస్తాయి.ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా ఉత్పత్తుల దిగుబడులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ఆక్వా ఉత్పత్తులు ఉత్పత్తి చేసే పది జిల్లాల్లో 2016-17లో ఉప్పునీటి ఆధారంగా అంటే సముద్రం నుంచి లభ్యమైన ఆక్వా ఉత్పత్తులు, చెరువులు ఏర్పాటుచేసి పెంచిన చేపలు, రొయ్యలు, వీటితో పాటు మంచినీటి చెరువుల్లో 27,66,193 టన్నులను ఉత్పత్తి చేశారు ఇక 2017-18 విషయానికి వస్తే 27,49,032 టన్నుల ఉత్పత్తి చేశారు. అంటే కొంత మేర ఉత్పత్తులు తగ్గాయి.అయితే కొన్ని ఒడిదుడుకుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని మత్య్సశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు ఆక్వా రైతులకను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి, జూన్ నాటికి మరో క్రాప్ ఆలోచనలో ఉన్న ఆక్వా రైతాంగం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే.
Tags: Summer Effect on Aqua

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *