అనంత లో సమ్మర్ కష్టాలు

Summer hardships in Anantha

Summer hardships in Anantha

Date:20/02/2018
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లాను ఈ ఏడాది కూడా క్షామం వెంటాడుతోంది. ఖరీఫ్, రబీ సీజన్‌లో వర్షాలు సరిగా కురవకపోవడంతో పంటలు ఎండిపోయా యి. పశుగ్రాసం సైతం కరువైంది. జిల్లా నుంచి పొట్టచేతబట్టుకుని జనం బెంగళూరు, మైసూరు, కేరళ, చెన్నై తదితర ప్రాంతాలను వలస వెళ్తున్నారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. కదిరి, పుట్టపర్తి, రాయదుర్గం, గోరంట్ల, మడకశిర, ధర్మవరం, గుంతకల్లు, నల్లమాడ తదితర ప్రాంతాల నుంచి వలసలు అధికంగా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో వృద్ధులు, పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. నల్లమాడ మండలం కుటాలపల్లిలో సుమారు 60 శాతం వరకు ఇళ్లు తాళాలతో కనిపిస్తున్నాయి. కదిరి ప్రాంతంలో సుమారు 15 ఏళ్ల క్రితం నాటి పరిస్థితి ఈసారి పునరావృతమవుతోంది. జిల్లాలో భూగర్భ జలాలు 1000 అడుగులకు పడిపోయాయి. జిల్లాలోని 1003 గ్రామ పంచాయతీల్లో 29.76 లక్షల జనాభా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అధికారికంగా 12,600 పైచిలుకు చేతిపంపులు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 7 నుంచి 8 వేల బోర్లలో మాత్రమే నీళ్లు వస్తున్నాయి. శింగనమల, అనంతపురం రూరల్, మడకశిర, హిందూపురం, గుంతకల్లు, కదిరి తదితర మండలాలతో పాటు 500 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు.కదిరి, అమడగూరు, నల్లమాడ, పుట్టపర్తి, గోరంట్ల, తాడిపత్రి, ముదిగుబ్బ, శింగనమల, మడకశిర, బుక్కపట్నం తదితర మండలాల్లో అధికభాగం గ్రామాలు, కుగ్రామాలు. అత్యంత మారుమూల అటవీ, కొండ ప్రాంతాలను ఆనుకుని ఉన్నాయి. ఈ గ్రామాల్లో కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు లభించడం గగనమే.గత మూడేళ్లుగా జిల్లాలోని మొత్తం 63 మండలాలను ప్రభుత్వం కరవు ప్రాంతాలుగా ప్రకటిస్తూనే ఉంది. ఈ ఏడాది కూడా అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. అయినా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావారణ బీమా సొమ్ము అందలేదు. ఫలితంగా రైతన్నలు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.జిల్లాలో సుమారు 6.2 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ వేరుశెనగ సాగు చేశారు. రబీలో వరితో పాటు వివిధ పంటలు వేశారు. వరుణుడు కరుణించకపోవడంతో పంటలు నిలువునా ఎండిపోయాయి. దీంతో వేరుశనగ కట్టె (గ్రాసం) అరకొరగానే దక్కింది.గ్రాసం కొరత, కరవు కారణంగా రైతులు, పశు పోషకులు తమ ఎద్దులు, ఆవుల్ని అయినకాడికి అమ్ముకుంటున్నారు. జిల్లాలో లక్షకు పైగా పశువులు కబేళాలకు తరలిపోయినట్లు సమాచారం. 2007 పశు గణాంకాల మేరకు అన్నిరకాల పశువులు 37.24 లక్షలు ఉండేవి. 2012 పశుగణన నాటికి 61.72 లక్షలకు పెరిగినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. 2007లో ఎద్దులు, ఆవులు 6,95,384 ఉండగా, ఆ సంఖ్య 2012 నాటికి 6,17,270కి చేరింది. ఈ లెక్కన దాదాపు 78 వేల పశువులు కనుమరుగయ్యాయి. ఈ ఏడాది లక్షకు పైగా పశువులు కబేళాలకు తరలి పోయి ఉంటాయని భావిస్తున్నారు.
Tags: Summer hardships in Anantha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *