తిరుమలలో సమ్మర్ రష్ 

Date:17/04/2018
తిరుమల ముచ్చట్లు:
 వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. ఈ నెల 15 నుంచి జులై 16 వరకు తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుంటున్నట్టు జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. భక్తులు తాకిడి ఎక్కువగా ఉండే క్రమంలో వారాంతంలో సిఫారసు లేఖలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. శుక్ర, శని, ఆదివారాలలో ప్రొటోకాల్‌ పరిధిలోని వారికి మాత్రమే వీఐపీ దర్శనాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా భక్తులు అధికంగా ఉండే క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి ఉద్యానవనం, ఉచిత వసతిగృహాల వద్ద ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.దర్శన ప్రవేశ మార్గాల్లో టీటీడీ విజిలెన్స్‌తో పాటు, పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు అవసరమైన లడ్డూలు సిద్దంగా ఉంచుతామన్నారు. శ్రీవారి పోటులో నిత్యం 3 లక్షల 50 వేల లడ్డూల తయారీచేస్తున్నట్టు తెలిపారు. వారానికి 127 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.  కాగా, అలిపిరి నుంచి మోకాళ్ల మెట్ల వరకు మరో రోడ్డు వేయడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎల్‌అండ్‌టీ కంపెనీతో సర్వే చేయిస్తోంది. మరో వైపు తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో వివాదం నెలకొంది. వేంకటేశ్వర స్వామి పరకామణి లెక్కింపు బాధ్యతను ప్రైవేట్‌ పరం చేసేందుకు టీటీడీ రంగం సిద్ధం చేసింది. అయితే టీటీడీ నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. పరకామణి సేవలో దేవస్థానం ఉద్యోగులు ఆసక్తి చూపకపోవడంతోనే దేవస్థానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.టీటీడీ ఉద్యోగులు పరకామణి లెక్కింపుకు ఆసక్తి చూపకపోవడంతో.. 2012లో దేవస్థానం భక్తుల కోసం పరకామణి సేవను ప్రారంభించింది. అప్పటి నుంచి కేవలం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పదవీవిరమణ చేసిన ఉద్యోగులను పరకామణి సేవలకు  టీటీడీ వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో పరకామణిని ప్రైవేటీకరణ చేయాలని దేవస్థానం అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంది. దీంతో భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో ప్రైవేటు ఏజెన్సీల జోక్యం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు.మరోవైపు పరకామణి సేవపై టీటీడీ నిర్ణయాన్ని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే అలిపిరి భద్రతను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారని, ఇపుడు పరకామణి సేవ కూడా ప్రైవేటు పరం చేయడం ఏంటని ప్రశ్నించారు. శ్రీవారి పరకామణి సేవలో పాల్గొనడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారని, అలాంటి వారిని పరకామణి సేవకు దూరం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా టీటీడీ తీసుకున్న నిర్ణయంపై ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
Tags: Summer rush in Tirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *