‘మద్దతు’ దక్కేనా?

Date:20/11/2018
కర్నూలు ముచ్చట్లు:
ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పంటలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దిగుబడులు క్షీణించాయి. ఉల్లి పంట కూడా ఎఫెక్ట్ అయింది. దీంతో ఈ దఫా కూడా ఆశించిన రాబడి దక్కదన్న ఆందోళన ఉల్లి రైతులను పీడిస్తోంది. ఇక ప్రభుత్వ పరంగానూ వారికి భరోసా లభించలేదన్న కామెంట్స్ కర్నూలులో చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి ఆరుగాలం శ్రమించినా అన్నదాతల స్థితిగతులు మెరుగుపడడంలేదు. కష్టపడి పండించిన సరకును మార్కెట్‌కు తెస్తే కనీసం కోత కూలీలకు కూడా గిట్టుబాటు కాని విధంగా ధరలు పలుకుతున్నాయి. దీంతో సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. కర్షకులకు కరువు పరిహారం చెల్లించాలని రైతు సంఘాలు ఆధ్వర్యంలో ఆందోళనలు సాగినా పాలకుల నుంచి తగినంత సహకారం లభించడంలేదని కొందరు అంటున్నారు. ఉల్లి పంటకు ఇప్పటివరకు మద్దతు ధర ప్రకటించలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు అధికమే. వర్షాభావ పరిస్థితులు ఉన్నా రైతులు కష్టపడి బోర్ల ద్వారా నీటిని అందిస్తూ ఉల్లిని సాగు చేశారు. అలాంటి రైతుకు కనీస గిట్టుబాటు ధర మార్కెట్‌లో లభించటం లేదని రైతు సంఘాల నేతలు అంటున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్ధితి లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
జిల్లాలో ఈ దఫా 27 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేసినట్లు తెలుస్తోంది. వర్షాధారం కింద వేసిన ఉల్లి పూర్తిగా ఎండిపోవడంతో బోరు బావుల కింద సాగు చేసిన ఉల్లి మాత్రమే మార్కెట్‌ కు వస్తోంది. ఉల్లిని విస్తృతంగా సాగుచేసినా గిట్టుబాటు ధర ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. క్వింటాకు కనీసం రూ.2 వేలు ఇస్తే రైతుకు ఆసరా దక్కినట్లు అవుతుంది. కానీ క్వింటాను రూ.వందల నుంచి రూ.1270 మించి కొనటం లేదని కొందరు వాపోతున్నారు. ఉల్లి రైతుల కష్టాలు తీరాలంటే ప్రభుత్వమే ముందుకు రావాలని రైతు సంఘాలు అంటున్నాయి. కనీస మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలాఉంటే ఉల్లి రైతుల సమస్యపై సర్కార్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మంచి మద్దతు ధరను ప్రకటించేందుకు సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఒక మద్దతు ధరను కల్పిస్తే ఆ ధర కంటే తక్కువకు వ్యాపారులు కొనుగోలు చేస్తే మిగతా ధరను ప్రభుత్వం రైతు బ్యాంకు ఖాతాకు జమ చేయాలని రైతులు విజ్ఞప్తిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఉల్లి రైతులను దష్టిలో పెట్టుకుని మద్దతు ధరను ప్రకటిస్తే ఉల్లి రైతులు బాధను వారి కష్టాలను తీర్చిన వారు అవుతారని రైతులు కోరుతున్నారు.
Tags:’Support’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *