వీవీప్యాట్లపై ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

   Date:15/03/2019
  న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 50శాతం మేర ఓటు రసీదు యంత్రాలను(వీవీప్యాట్‌లను) లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాల దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కోర్టుకు వివరాలు అందించేందుకు ఓ సినియర్‌ అధికారిని నియమించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈసీని ఆదేశించింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ద్వారా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా 50శాతం మేర వీవీప్యాట్‌లను లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చేలా నిబంధనలు తీసుకురావాలని 23 రాజకీయ పార్టీలు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశాయి.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, ఎస్పీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్‌యాదవ్‌, సతీష్‌ చంద్ర మిశ్రల నేతృత్వంలో 21 పార్టీల నేతలు ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా, కమిషనర్‌ అశోక్‌ లవాసాలను కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే ఈసీ నుంచి సంతృప్తికర స్పందన లేకపోవడంతో వీరంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈసీ స్పందన కోరింది.
Tags:Supreme Court notices to EC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *