జిల్లాల్లో ఊపందుకొంటున్న సర్వేలు

Date:15/02/2018
విజయవాడ ముచ్చట్లు:
ఎన్నికల ఏడాది కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రముఖ ప్రైవేటు సంస్థలు, విద్యార్థులతో రాజకీయ పరిస్థితులపై సర్వేలు చేయిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎంబీఏ, పోస్టు గ్రాడ్యుయేషన్ తదితర ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులను నియమించి బయటకు పొక్కకుండా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ప్రైవేటు సంస్థలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా వారంరోజులుగా వివిధ ప్రైవేటు సంస్థలు సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. హిందూపురం నియోజకవర్గంలో సైతం హైదరాబాద్‌కు చెందిన ఓ నెట్‌వర్క్ సంస్థ ఎనిమిది బృందాలను రంగంలోకి దింపింది. ఈ బృందాలు స్థానిక సమస్యలు, ఎమ్మెల్యే పనితీరు, ప్రధాన పార్టీల నేతల వ్యవహారశైలి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను సర్వే బృందాలు అడిగి తెలుసుకుంటున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అన్న అంశాలను ఆరా తీస్తున్నాయి. అదేవిధంగా ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు నేతల పేర్లను సర్వే నివేదికలో పొందుపరిచి ఎవరైతే బాగుంటుంది, మీరెవరికి మద్దతు ఇస్తారు అన్న కోణాల్లో అభిప్రాయాలను సేకరిస్తున్నాయి. ఓవైపు మీడియా సంస్థల ప్రతినిధులతోపాటు మరోవైపు ప్రైవేటు సంస్థలు కూడా రంగంలోకి దిగి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, స్థానికంగా ఎవరికి మద్దతు ఉంది అన్న కోణాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. దీనికితోడు తమను నమ్మిన సంస్థలను రంగంలోకి దింపి ప్రజల అభిప్రాయాలను రహస్యంగా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ నిఘా వర్గాల ద్వారా కూడా సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధి పనుల తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటున్నట్లు సమాచారం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల వైఖరి, ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ, బీమా పథకాలు తదితర అంశాల్లో ప్రజలు ఎంత మేర సంతృప్తికరంగా ఉంటున్నారన్న విషయాలపై నిఘా వర్గాల ద్వారా తెలుసుకుంటున్న తెలుస్తోంది. ఈవిషయమై సర్వేలో పాల్గొన్న యువకులను అడగ్గా రహస్యంగా నివేదికలు అందిస్తామని తెలిపారు. ఏ పార్టీకీ తాము సంబంధం లేదని, తమ సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజలతో స్పష్టమైన అభిప్రాయాలను తీసుకుని రహస్యంగా నివేదిక సమర్పించనున్నట్లు చెప్పారు.
Tags: Surveys emerging in districts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *