సుష్మాస్వరాజ్ ఎన్నికల్లో పోటీకి దూరంగా….

Sushma Swaraj to contest elections
Date:20/03/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
సుష్మా స్వరాజ్… ఈ పేరు తెలియని వారుండరు. ఆమె ఏ పదవి చేపట్టినా ఆ పదవికే వన్నె తెస్తారు. అలాంటి సుష్మాస్వరాజ్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోతున్నారు. విదేశాంగ మంత్రిగా పేరుప్రతిష్టలు తెచ్చుకున్న సుష్మాస్వరాజ్ తాను పోటీకి దూరమని గతంలోనే ప్రకటించారు. అయితే రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండనని చెప్పేశారు. అంటే ప్రత్యక్ష ఎన్నికలకు ఆమె దూరమవుతున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆమె చేపట్టని పదవి లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఏడుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘన చరిత్ర ఆమె సొంతం. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలిగా, కేంద్రమంత్రిగా ఇలా ఏ పదవి చేపట్టినా మెరుగైన పనితీరుతో పదవులకే వన్నె తెచ్చారు ఆవిడ. ప్రస్తుతం విదేశాంగ మంత్రిగా ఎందరో అభాగ్యులకు, నిరుపేదలకు నేనున్నానంటూ అండగా నిలిచారు. అలాంటి నేత రాజకీయాల నుంచి రిటైరవుతానని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడంతో లోక్ సభలో ఆమె గొంతు ఇక విన్పంచదు.చిన్న తనం నుంచే సుష్మ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేశారు. 1952 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ లో జన్మించిన సుష‌్మ పూర్వీకులది పాకిస్థాన్ లోని లాహోర్ నగరం. చంఢీఘడ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు. అప్పట్లో వరుసగా మూడేళ్లపాటు ఉత్తమ హిందీవక్తగా అవార్డు పొందారు. 1973లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఆమె భర్త స్వరాజ్ కౌశల్ కూడా ప్రముఖ న్యాయవాది. మాజీ కేంద్రమంత్రి జార్జి ఫెర్నాండజ్ న్యాయవాద బృందంలో సుష్మ పనిచేశారు. అత్యవసర పరిస్థితి సమయంలో జైలుకెళ్లారు.పాతికేళ్ల వయసులోనే 1977లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. హర్యానా ముఖ్యమంత్రి దేవీలాల్ మంత్రివర్గంలో చేరారు.
అంబాలా కంటోన్మెంట్ కు ఎన్నికైన అతి చిన్న వయస్కురాలు ఆమే. దేవీలాల్ మంత్రివర్గంలో చిన్న వయసు కలిగిన వ్యక్తి కూడా ఆమే కావడం విశేషం. 1979లో హర్యానా జనతా పార్టీ అధ్యక్షురాలిగా పనిచేశారు. 1987-90ల మధ్య కాలంలో రాష్ట్రంలోని జనతా పార్టీ లోక్ దళ్ మంత్రివర్గంలో పనిచేశారు. 1998లో కేంద్రంలో వాజ్ పేయి మంత్రివర్గంలో పనిచేశారు. అదే ఏడాది అక్టోబరు లో ఢిల్లీ సీఎంగా ఎన్నికయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తొలి మహిళానేత సుష్మా స్వరాజ్ కావడం విశేషం. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని విదీష నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2009 నుంచి 2014 వరకూ లోక్ సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.998లో కర్ణాటక బళ్లారిలో సోనియాగాంధీపై పోటీ చేసిన ధీమంతురాలు. నుదుట బొట్టు, సంప్రదాయ వస్త్రధారణతో నూటికి నూరుశాతం భారతీయతను ప్రతిబింబించే సుష్మాస్వరాజ్ అనారోగ్య కారణాల రీత్యా 2019 ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. మోదీ వ్యతిరేక గ్రూపులో ఉండటం,అద్వానీ శిష్యురాలిగా గుర్తింపు కారణంగా బీజేపీ కొత్త నాయకత్వం ఆమెను పక్కన పెట్టినట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే ఆమె రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే సుష్మా స్వరాజ్ రాజకీయాల నుంచి మాత్రం రిటైర్మ్ మెంట్ ప్రకటించలేదు. ఆమెను రాజ్యసభకు ఎంపిక చేయవచ్చన్నది బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Tags:Sushma Swaraj to contest elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *