Natyam ad

ఆమాంతంగా పెరిగిన  గుడ్ల ధరలు

విశాఖపట్నం ముచ్చట్లు:

చలి పెరిగిందంటే చాలు.. ఎక్కువ మంది మాంసాహారంపై మక్కువ చూపిస్తుంటారు. ఎందుకంటే వీటివల్ల శరీరంలో వేడి పుడుతుందని నమ్మకం. అందుకే ఉష్ణోగ్రతలు ఎంత తగ్గితే వీటి ఉత్పత్తుల వినియోగం అంత పెరుగుతుంటుంది. ఈ పరిస్థితుల వల్ల గుడ్లకు ఉత్తర రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగి, ఎగుమతులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో రెండు నెలల కాలంలో ఏకంగా వంద గుడ్లకు రెండొందలు వరకు పెరుగుదల కనిపిస్తోంది.. అనుకోని విధంగా కలిసివచ్చిన ఈ అదనపు ఆదాయం వల్ల లేయర్ ఫాం రైతులు నష్టాల నుంచి బయటపడుతున్నారు..రాష్ట్రంలో గుడ్ల ఉత్పత్తికి ఉత్తర కోస్తా ముందంజలో ఉంటుంది. ఇక్కడ సుమారుగా 250కి మించి లేయర్ ఫాంలు ఉన్నాయి. వీటిలో సుమారుగా 2 కోట్ల 50 లక్షల వరకు కోళ్లు ఉంటాయి. వీటి నుంచి రోజుకు 80 శాతం మేర అంటే సుమారుగా 2 కోట్ల మేర గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిలో ఉత్తర కోస్తాలోని ఉమ్మడి ఐదు జిల్లాల వినియోగదారులు రోజూ 80 నుంచి 90 లక్షల గుడ్లను వినియోగిస్తుంటారు. మిగిలిన వాటిని ఒడిశా, పశ్చిమబెంగాల్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు.సాధారణంగా ఏటా చలికాలంలో వీటి వినియోగం పెరుగుతూ ఉంటుంది. ఈ కాలంలో చలిని తట్టుకునేందుకు మాంసాహారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. దీనివల్ల శరీరంలో వేడి పెరిగి, దానికి అనుగుణంగా చలిని తట్టుకోవచ్చని ప్రజలు నమ్ముతుంటారు.

 

 

 

Post Midle

ఇదేకాకుండా కరోనా సమయం నుంచి అధికశాతం ఇళ్లల్లో గుడ్లు వినియోగం పెరిగింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఉత్తరాదితో పాటు మన రాష్ట్రంలోనూ చలి పెరగడంతో గుడ్ల వినియోగం ఎక్కువయ్యింది. సాధారణంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. అదేవిధంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కొంతమేర ఏపీలోని ఉత్తరాంధ్రకు, మరికొంత ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తుంటారు.రెండు నెలల క్రితం రూ. 420 నుంచి రూ. 430 వరకు పలికిన వంద గుడ్ల ధర, క్రమేపీ పెరుగుతూ నాలుగు రోజుల క్రితం రూ. 610కి చేరింది. ప్రస్తుతం సంక్రాంతి నేపథ్యంలో వీటి వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల వ్యాపారులు ఇదే ధరతో అమ్మకం చేస్తున్నారు. మరో నెల రోజుల పాటు ఇదే ధర కొనసాగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. చలి తీవ్రత వల్ల వినియోగం పెరగడమే దీనికి ప్రధాన కారణమని గుడ్ల ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు రామారావు చెబుతున్నారు. చలి తగ్గితే దానికి అనుగుణంగా ధరలు తగ్గుతూ వస్తాయని అంటున్నారు. ఈ విధమైన ధర పెరుగుదల వల్ల వినియోగదారులపై కొంతమేర అదనపు భారం పడినా, లేయర్ ఫాంలు నిర్వహిస్తున్న రైతులు నష్టాల ఊబిలోంచి బయటపడే అవకాశం వచ్చిందని వారంతా సంతోషిస్తున్నారు. ఇటీవల కాలంలో కోళ్లకు అందించే మేత ధరలు పెరగడం వల్ల నిర్వహకులు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం పెరిగిన గుడ్ల ధరల వల్ల కాస్త ఉపశమనం లభించేనట్టేనని రైతులు ఆనందిస్తున్నారు.

 

Tags; Suspiciously increased egg prices

Post Midle