ఎస్వీ శిల్ప కళాశాల కళా ఖండాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం – డిఈవో భాస్కర్‌రెడ్డి
– భారతీయ వారసత్వ సంపదగా నిలిచే సంప్రదాయ కళల సంరక్షణ – ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి
తిరుమల ముచ్చట్లు:
ఎస్వీ శిల్ప కళాశాల విద్యార్థులు రూపొందించిన కళా ఖండాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం ఉందని టీటీడీ డిఈవో భాస్కర్ రెడ్డి తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో మంగళవారం డిఈవో, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా డిఈవో మాట్లాడుతూ, సనాతన హైందవ ధర్మాన్ని కాపాడటంలో భాగంగా శిల్ప కళాశాలను 1960లో ప్రారంభించిందని, గత ఆరు దశాబ్దాలుగా ఈ ప్రతిష్టాత్మక సంస్థ నుండి దాదాపు 800 మంది విద్యార్థులు తమ నాలుగేళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేసి వివిధ రంగాలలో స్థిరపడ్డారన్నారు. రాబోయే తరాలకు సుసంపన్నమైన ఆలయ సంస్కృతిని, వాస్తు శిల్ప సంపదను అందిస్తుందన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి మాట్లాడుతూ, దేవాలయాల నిర్మాణ విభాగము, శిలా, సుధా, లోహ మరియు దారు (చెక్క) శిల్ప విభాగములు, సంప్రదాయ వర్ణ చిత్రలేఖన, సంప్రదాయ కలంకారి కళ వంటి కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్టాలలో ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు స్థపతులుగా ఉన్నరన్నారు. శిల్పకళాశాల విద్యార్థులు రూపొందించిన దేవాలయ విమానాలు, మండపాలు, గోపురాలు, శిలాశిల్పాలు, సుధాశిల్పాలు, దారుశిల్పాలు, పంచలోహ శిల్పాలు, సంప్రదాయ వర్ణచిత్రాలు, సంప్రదాయ కలంకారి వర్ణచిత్రాలను ప్రదర్శించడంతోపాటు విక్రయిస్తారన్నారు.
కళాశాలలోని ప్రతి విద్యార్థికి లక్ష రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేసి, వారి కోర్సు పూర్తయిన తరువాత వడ్డీతో సహా వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎపిఆర్వో కుమారి పి.నీలిమ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:SV Shilpa Kalashala’s Art Departments are world famous – DEO Bhaskar Reddy
