ఎస్వీ, బుట్టా కూని రాగాలు 

sv mohan reddy butta renuka

sv mohan reddy butta renuka

 Date:26/03/2019
అనంతపురం  ముచ్చట్లు:
ఇప్పుడు వీరిద్దరి పరిస్థితి అయోమయంగా తయారైంది. గత ఎన్నికల్లో ఓట్లు తమకు వేయమని అర్థించిన వీరు ఈసారి అనూహ్యంగా అభ్యర్థులకు ప్రచారకర్తలుగా మారారు. విధి వైచిత్రమంటే ఇదేనేమో. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున కర్నూలు పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేసిన బుట్టా రేణుక, కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా నెగ్గిన ఎస్వీ మోహన్ రెడ్డిలు ఇప్పుడు కర్నూలు జిల్లాల్లో ఆ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. గత ఎన్నికల్లో పోటీలో ఉన్న వీరిద్దరికీ ఇప్పుడు టిక్కెట్లు దక్కలేదు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తుండటం విశేషం.బుట్టా రేణుక. తొలిసారి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా ఎంపీ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో బలంగా ఉండటంతో బుట్టా రేణుక ఈజీగా గెలిచారు. తర్వాత పార్టీ అధికారంలోకి రాకపోవడంతో రేణుక భర్త టీడీపీలోకి జంప్ చేశారు. బుట్టా రేణుకు మాత్రం మూడేళ్లు వెయిట్ చేసి మరీ అధికార పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీ బుట్టా రేణుకకు టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీలో చేరడంతో ఆయనకే కన్ఫర్మ్ చేసింది. దీంతో బుట్టా రేణుక కనీసం ఆదోని టిక్కెట్ ఇవ్వమని అభ్యర్థించారు. అందుకు కూడా టీడీపీ అధిష్టానం అంగీకరించకపోవడంతో తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరారు.
వైసీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్ ను ఎంపిక చేసింది. సంజీవ్ కుమార్ ఆయుష్మాన్ ఆసుపత్రి అధినేతగా జిల్లా ప్రజలకు సుపరిచితులు. ఇప్పుడు సంజీవ్ కుమార్ కు మద్దతుగా బుట్టా రేణుక ప్రచారాన్ని ప్రారంభించారు. సంజీవ్ కుమార్ ను గెలిపించుకోవడమే తన లక్ష్యమని బుట్టా చెబుతున్నారు. తన పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఆమె సంజీవ్ కుమార్ కు మద్దతుగా పర్యటిస్తున్నారు. సంజీవ్ కుమార్ కూడా తమ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో బుట్టా రేణుక ఇప్పుడు కోట్లను ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు.ఇక ఎస్వీ మోహన్ రెడ్డి సయితం నిన్నటి వరకూ కర్నూలు ఎమ్మెల్యే. ఇప్పుడు ఎక్కడా టిక్కెట్ దొరకలేదు. బుట్టా చేసిన తప్పునే ఎస్వీ మోహన్ రెడ్డి కూడా చేశారు.పార్టీ మారి వచ్చినా టీడీపీలో టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన తనకు టిక్కెట్ రాకుండా చేసిన టీజీ కుటుంబంపై కసి తీర్చుకోవడానికి రెడీ అయిపోయారు. వైసీపీలో చేరిన ఎస్వీ మోహన్ రెడ్డి అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి హఫీజ్ ఖాన్ కు మద్దతుగా ప్రచారానికి దిగారు. తన మద్దతుదారులందరినీ కలుపుకుని ఆయన కర్నూలు నగరంలో పర్యటస్తూ వైసీపీని గెలిపించాలని కోరుతున్నారు. ఐదేళ్లలో ఒక నిర్ణయం వీరిద్దరి రాజకీయ జీవితాలనే మార్చివేసిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
Tags: sv mohan reddy butta renuka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *