స్విమ్స్ ను దేశంలోని అత్యుత్తమ ఆసుపత్రుల్లో ఒకటిగా తయారు చేయాలి-టీటీడీ ఈవో   ఎ వి ధర్మారెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

 

స్విమ్స్ ఆసుపత్రిని దేశంలో అత్యుత్తమమైన ఆసుపత్రుల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని టీటీడీ ఈవో  ఎ వి ధర్మారెడ్డి డాక్టర్లకు పిలుపునిచ్చారు. ఇందుకోసం టీటీడీ అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందని, బిల్లు చెల్లించి సర్జరీలు, ఇతర వైద్య సేవలు పొందగలిగే శక్తి ఉన్న రోగులు స్విమ్స్ వచ్చేలా వైద్య సేవలు ఉండాలని కోరారు.స్విమ్స్ ఆసుపత్రిలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం ఈవో డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్విమ్స్ లో ఎయిమ్స్ తరహా సదుపాయాలు బ్రహ్మాండమైన అనుభవం కలిగిన డాక్టర్లు ఉన్నారన్నారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా లేని విధంగా సదుపాయాలతో 30 పేయింగ్ రూమ్ లు నిర్మించామని, ఆరు నెలల్లో 16 శాతం మాత్రమే రోగులు ఈ గదులు పొందారని ఆయన తెలిపారు. రోగులు నేరుగా వచ్చి తమకు ఈ గదులు కావాలని, ఇక్కడ ఉండి వైద్యం చేయించుకుంటామని ఒత్తిడి చేసే స్థాయికి చేరాలని చెప్పారు. కోవిడ్ సమయంలో స్విమ్స్ లో బెడ్ ల కోసం ఎంత డిమాండ్ ఏర్పడిందో, అలాంటి పరిస్థితి స్విమ్స్ కు ఎప్పుడూ ఉండేలా చేయగలిగిన శక్తి డాక్టర్లకు మాత్రమే ఉందన్నారు. రోగుల పట్ల ప్రేమగా వ్యవహరించడం, మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం, 100 శాతం సక్సెస్ రేట్ సాధించడం వల్లే ఇది సాధ్యం అవుతుందన్నారు.
బర్డ్ ఆసుపత్రిలో గత రెండేళ్ళుగా అనేక మార్పులు చేసి నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు.దీని వల్ల అక్కడ డబ్బులు చెల్లించి ఆపరేషన్లు చేయించుకోవడానికి కూడా రోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని శ్రీ ధర్మారెడ్డి వివరించారు. బర్డ్ లో వసతులు పెంచి కార్పొరేట్ ఆసుపత్రుల కంటే మంచి వైద్యం అందిస్తున్నందువల్ల రోగుల్లో విశ్వసనీయత పెరిగిందని ఆయన తెలిపారు. అక్కడ ఉన్న 36 పేయింగ్ రూమ్ లు ఎప్పుడూ ఖాళీగా ఉండవని, గదుల కోసం సిఫారసులు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు.

 

 

అక్కడ డాక్టర్ల బృందం అంకిత భావంతో సేవలు అందించడమే కారణమన్నారు. ఆరు నెలల క్రితం ప్రారంభించిన శ్రీ పద్మావతి హృదయాలయం లో 500 సర్జరీలు విజయవంతంగా చేసి దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా పేరు సాధించారని ఈవో వెల్లడించారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి వారి బృందం అంకితభావం, నిబద్ధత ఇందుకు కారణమని ఈవో చెప్పారు.
సిమ్స్ వైద్యులు కూడా ఆసుపత్రి తమదిగా, రోగులను తమ బిడ్డలుగా భావించి ఉత్తమమైన వైద్య సేవలు అందిస్తే ఆసుపత్రిని దేశంలోని అత్యుత్తమ ఆసుపత్రుల్లో ఒకటిగా చేయడం కష్టం కాదన్నారు. రాబోయే ఆరు నెలల్లో అపోలో లాంటి ఆసుపత్రులకు వెళ్ళే రోగులు కూడా స్విమ్స్ కు వచ్చేలా చేయాలని ఆయన కోరారు.జెఈవో లుసదా భార్గవి,  వీర బ్రహ్మం, ఎఫ్ఎ సీఎవో  బాలాజి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు.

 

Tags: SWIMS should be made one of the best hospitals in the country – TTD EO AV Dharma Reddy

Leave A Reply

Your email address will not be published.