గుంటూరులో స్వైన్ ఫ్లూ

Swine flu in Guntur

Swine flu in Guntur

Date:24/11/2018
గుంటూరు ముచ్చట్లు:
స్వైన్‌ఫ్లూ మహమ్మారి జిల్లా ప్రజల్ని వణికిస్తోంది. గుంటూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పూర్తిగా విఫలం చెందారని చెప్పవచ్చు. రాజధాని జిల్లాలో పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమైన విషయమని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి ద్వారా వ్యాపించే స్వైన్‌ఫ్లూ అత్యంత ప్రాణాంతకంగా మారి జిల్లా ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. రాజధాని జిల్లా కావడంతో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నిత్యం వేలాది మంది ఇక్కడకు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో జిల్లాలో స్వైన్‌ఫ్లూ బారిన పడి ఇప్పటికే పది మంది వరకు మృతి చెందారు. నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలో ముగ్గురు మృతి చెందడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.రోజురోజుకు బాధితులతో పాటు, మరణాలు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. రాజధాని జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉన్నా అటు ప్రభుత్వం గానీ, ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గానీ స్పందించిన దాఖలాలు లేవు. స్వైన్‌ఫ్లూ బాధితుల్లో, మరణిస్తున్న వారిలో మహిళలు, గర్భిణులు, పసికందులు అధికంగా ఉండటం మరింత ఆందోళనకు గురిచేసే విషయం.
జిల్లాలో నెలల వయస్సు ఉన్న ఓ పసికందు స్వైన్‌ఫ్లూతో మృతి చెందగా, కవలల పిల్లల్లో ఒకరైన మరో పసికందుకు వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వ్యాధితో ఓ గర్భిణి మృతి చెందగా, ప్రస్తుతం మరో ముగ్గురికి ఉన్నట్లు నిర్ధారించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.రాజధాని జిల్లాలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి విజృంభిస్తుండటంతో బాధితులతోపాటు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయినప్పటికీ అటు ప్రభుత్వం, ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు గానీ స్పందించిన దాఖలాలు లేకపోవడం దారుణమైన విషయం. ఇతర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే వారికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేయకుండా వదిలేయడం వల్ల రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వ్యాధి నిర్ధారణ అయిన వారి కుటుంబ సభ్యులతోపాటు చుట్టుపక్కల వారికి సైతం పరీక్షలు నిర్వహించి వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జీజీహెచ్‌లో మరో ముగ్గురు గర్భిణులకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు.
Tags:Swine flu in Guntur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *