కోడి కత్తి నిందితుడుకు బెయిల్

Date:24/05/2019

విశాఖపట్టణం ముచ్చట్లు:

అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 175 స్థానాలకు గాను వైసీపీ 151 సీట్లు గెలుచుకుని ఘనవిజయం సాధించింది. పార్టీ ఏర్పడిన 8 సంవత్సరాలకు అధికారం చేపట్టడంతో పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా ఉన్నాయి. వైసీపీ శ్రేణులంతా విజయగర్వంతో ఊగిపోయిన గురువారమే జగన్‌పై దాడికేసు నిందితుడికి న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం గమనార్హం. జగన్‌పై గతేడాది విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడిచేసిన శ్రీనివాస్ రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి విజయవాడలోని న్యాయస్థానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. తన క్లయింట్ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నందున బెయిల్‌ మంజూరు చేయాలని అతని తరఫు న్యాయవాది సలీమ్‌ వారంరోజుల క్రితం విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో సెక్షన్‌ 55(ఎ) కింద పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి సంబంధించి న్యాయ నిపుణుల అభిప్రాయం కోర్టు ముందుకు రావడంతో గురువారం వాదనలు జరిగాయి.

 

 

తన క్లయింట్‌ మలేరియా, డెంగీ, అజీర్ణంతో బాధపడుతున్నాడని సలీమ్‌ కోర్టుకు తెలిపారు. గుండె సంబంధిత వ్యాధి కూడా సోకే అవకాశం ఉన్నందున అతడికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ వాదనలు విన్న జడ్జి పార్ధసారథి రూ.60వేలు, ఇద్దరి పూచీకత్తుపై శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేశారు. జగన్‌ సీఎం కావడానికి సానుభూతి కోసమే దాడికి పాల్పడ్డానని శ్రీనివాస్ చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తానికి శ్రీనివాస్ కోరుకున్నట్లుగానే జగన్ సీఎం కానుండటం, ఆయన పార్టీ అఖండ విజయం సాధించిన రోజే శ్రీనివాస్‌కు బెయిల్ రావడం యాదృచ్ఛికం .

 

30న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం

 

Tags: Bail for a knife knife