నగదు రహితం.., రేషన్ రహితం కూడా.. 

Date:14/03/2018
కర్నూలు ముచ్చట్లు:
నగదు రహిత లావాదేవీలు లబ్ధిదారులను కష్టాలపాలు చేస్తున్నారు.నిత్యావసర సరకుల కోసం లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్లు మొరాయిస్తున్నాయి. బ్యాంకు ఖాతాలకు, సర్వర్‌కు అనుసంధానం కావడం లేదు. దీంతో లబ్ధిదారులు సరకుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ క్రమంలో డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈనెల ఈపాస్‌ ద్వారా రేషన్‌ సరకులు నగదు రహితంగా పంపిణీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. కార్డుదారులకు క్యాష్‌లెస్‌ విధానం ద్వారానే సరకులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయింది. 2016 డిసెంబరు, 2017 జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో నగదురహితంగా రేషన్‌ సరకులు పంపిణీ చేశారు. నగదు కొరత ఉన్నందున ఈ ఏడాది మార్చి నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈమేరకు జిల్లా సంయుక్త సర్వోన్నతాధికారి ప్రసన్న వెంకటేష్‌ జిల్లాలో అన్ని మండలాల్లో, కర్నూలు అర్బన్‌లో నగదురహితంగా రేషన్‌ సరకులు పంపిణీ చేయాలని ఆర్డీవోలు, తహసీల్దార్లు, పౌరసరఫరాల అధికారులు, సీఎస్‌డీటీలను ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం రెండు చౌకదుకాణాల్లో వందశాతం నూతన విధానంలో సరకులు ఇప్పించాలని ఆయన ఆదేశించారు.జిల్లాలో 2,428 చౌక దుకాణాలు ఉన్నాయి. 11,81,825 కార్డుదారులు ఉన్నారు. ఒకటో తేదీ నుంచి అయిదో తేదీ వరకు 6,75,762 మంది కార్డుదారులకు సరకులు పంపిణీ చేయగా అందులో నగదు రహితంగా కేవలం 30,207 మంది కార్డుదారులకు అందించారు. దీంతో రాష్ట్రంలో కర్నూలు జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఫినో కంపెనీ జిల్లాలో ఆళ్లగడ్డ, కోయిలకుంట్ల, నంద్యాల, బనగానపల్లె, నందికొట్కూరు ప్రాంతాల్లో 1007 చౌకదుకాణాల్లో నగదురహితంగా సేవలందించేందుకు పనిచేస్తోంది. 1007 దుకాణాలకు గాను 439 దుకాణాల్లోనే నగదురహితంగా సరకులు పంపిణీ చేస్తున్నారు. ఇంటగ్రా కంపెనీ 20 దుకాణాల్లో పనిచేస్త్తోంది. ఐజీఎస్‌ అనే కంపెనీ సిండికేట్‌ బ్యాంకు సహకారంతో పనిచేస్తోంది. ఈ కంపెనీ 1381 దుకాణాల్లో నగదురహితంగా సేవలందించాల్సి ఉంది. ఐజీఎస్‌ కంపెనీ వారి సేవలు నిలిచిపోయాయి. 
Tags: Cashless ..