సరికొత్త సాగు.. 

Date:14/03/2018
ఖమ్మం ముచ్చట్లు:
వ్యవసాయ సాగులో మేటి పద్ధతులతో రైతులు దూసుకుపోతున్నారు. మూస పరిస్థితులకు భిన్నంగానే ముందుకు సాగుతున్నారు. ఏటా కూలీల కొరతతో పాటు వారికోసం అధిక వ్యయం వెచ్చించలేని రైతులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. చివరకు ప్రత్యామ్నాయం కాస్త వినూత్నంగా అన్నదాతలకు లాభదాయకంగా మారుతుండటంతో ఈ కొత్త సాగు పద్ధతులు ఏటా పెరుగుతున్నాయి.వరిసాగు అంటే ఎంతో ప్రయాస. నాలుగు నెలల పాటు నిర్విరామంగా సాగునీటి లభ్యత ఉండాలి. దీనికితోడు దమ్ము చేసి వరినారు పోసేనాటి నుంచి నారును పెంచడం,  నారును వేరుచేసి మళ్లీ నాట్లు వేయడం పెద్ద ప్రహసనమే. కొన్నేళ్లుగా ఈ ప్రక్రియతో వరిసాగు చేసే రైతులు ఎంతో వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారు.ఈ తరుణంలో కూలీల లభ్యత తగ్గడం, వారి కోసం అధిక వ్యయం, అధిక సమయం వెచ్చించలేక  విసుగు చెందుతున్నారు. యాంత్రీకరణ అందుబాటులోకి వచ్చినప్పటికి వరినారు, నాట్లు వేసే అంశం కీలకంగా ఉండటంతో ఎక్కువగా కూలీలపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మూడు, నాలుగేళ్లుగా వరిసాగులో ఈ వ్యయప్రయాసలకు స్వస్తి పలికేలా నేరుగా వెదజల్లే పద్ధతిని పాటించాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ చేస్తున్న ప్రచారానికి తోడుగా క్షేత్రంలో బాధలు భరించలేని రైతులు నేరుగా వెదజల్లే పద్ధతిపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీనివల్ల రైతులకే ఎన్నో లాభాలు, ఉపయోగాలు మెండుగా ఉండటం విశేషం.జిల్లాలో ఇలా.. నాలుగైదేళ్ల కిందట ఉభయ జిల్లాలో నేరుగా వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేయడం చాలా కష్టంగా భావించేవారు. అప్పట్లో కేవలం చర్లలో ఐదెకరాలతో నేరుగా వెదజల్లే పద్ధతిని పాటించారు. కానీ నేడు ఉభయ జిల్లాలో ఈ విస్తీర్ణం క్రమంగా పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని వైరా, కూసుమంచి, సత్తుపల్లి, తల్లాడ, కామేపల్లి, భద్రాద్రి జిల్లాలో వేంసూరు, చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురంలో నేరుగా వెదజల్లే పద్ధతిని ఎక్కువగా ఆచరిస్తున్నారు. వైరా మండలంలో సుమారు 1500 ఎకరాలు, కూసుమంచిలో 1500 ఎకరాలు, తల్లాడ మండలంలో 1700 ఎకరాల్లో ఉండగా కేవలం కొత్తవెంకటగిరిలోనే వెయ్యి ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు అధికారులు  పేర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే ఇతర మండలాల్లోనూ ఈపద్ధతి పెరుగుతుంది. నేరుగా వెదజల్లే పద్ధతితోపాటు డ్రమ్‌సీడర్‌ పద్ధతిని అక్కడక్కడా పాటిస్తున్నారు. డ్రమ్‌సీడర్‌ పద్ధతిలోనూ ఒకేసారి వరి విత్తనాలను వదిలాక నేరుగా సాగు చేసుకొనే పద్ధతినే ఉంది.
Tags: New cultivation ..