కేసీఆర్‌, మోదీ పాలనపై విరుచుకుపడిన రాహుల్‌ గాంధీ

-మోదీ దేశానికి ప్రధాని కాదని, దొంగలకు చౌకీదార్‌
-కార్పొరేట్‌ వ్యాపారులకు తప్ప పేదలకు రుణాలు దక్కడంలేదు
-వనపర్తిలో ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ గాంధీ
Date:01/04/2019
వనపర్తి ముచ్చట్లు:
కేసీఆర్‌, మోదీ పాలనపై తీవ్రస్థాయిలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. మోదీ దేశానికి ప్రధాని కాదని, దొంగలకు చౌకీదార్‌ అని ఆరోపించారు.తెలంగాణలో సీఎం కేసీఆర్‌.. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ దోపిడీకి పాల్పడుతున్నారని దొంగల జేబుల్లో రూ.వేల కోట్లు జమచేశారని ఆరోపించారు. తెలంగాణలో ఒకే ఒక్క కుటుంబం సర్వం దోపిడీ చేస్తోందని, రైతులు, యువత నుంచి లాక్కొని తన బొక్కసం నింపుకొంటోందని మండిపడ్డారు. సోమవారం వనపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ వీరిద్దరి మధ్యా రహస్య మిత్ర బంధం ఉందని ఆరోపించారు. మోదీ చేసిన నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. తదితర అంశాలకు కేసీఆర్‌ మద్దతు ఇచ్చిన విషయాన్ని రాహుల్‌ గుర్తు చేశారు. అలాగే, కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా రాహుల్‌ ప్రజలకు వివరించారు.
‘‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు అండగా నిలబడింది. రాష్ట్రంలో కేసీఆర్‌, కేంద్రంలో మోదీ పాలన ఒకేలా ఉంది. 15-20 మంది ధనవంతులు మాత్రమే వారి పాలనతో ప్రయోజనాలు పొందుతున్నారు. మోదీ ప్రభుత్వం కొద్ది మంది శ్రీమంతులకు లక్షల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చింది. ప్రధాని కాగానే మోదీ పేదల ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తానని ఎందుకు వేయలేదు. మేం మోదీలా అబద్ధాలు చెప్పం. అధికారంలోకి రాగానే ఏడాదికి రూ.72వేలు చొప్పున మహిళల ఖాతాల్లో జమ వేస్తాం. కాంగ్రెస్‌ పాలనలో పేదల కొనుగోలు శక్తి పెరుగుతుంది. నోట్ల రద్దు, గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌తో మోదీ అందరినీ రోడ్డున పడేశారు’’ అని విమర్శించారు.  ‘‘కాంగ్రెస్‌ నిర్ణయాల వల్ల మహిళలు ఆర్థికంగా శక్తిమంతులు కానున్నారు. కనీసం రూ.12వేల కంటే తక్కువ ఆదాయం ఎవరికీ ఉండదు.
అందరికీ న్యాయం చేసేందుకే కనీస ఆదాయ పథకానికి న్యాయ్‌ అనే పేరు పెట్టాం. ఈ పథకంతో పేదరికంపై కాంగ్రెస్‌ మెరుపు దాడులు చేయనుంది. ఈ పథకం చరిత్రాత్మకమైనది, కాంగ్రెస్‌ మాత్రమే ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకుంటుంది. దీనిద్వారా 5కోట్ల కుటుంబాలకు నేరుగా నగదు జమచేస్తాం. ఎలాంటి అనుమతి లేకుండా పేదలు కుటీర పరిశ్రమలు, చిన్నవ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. మోదీ పాలనలో కార్పొరేట్‌ వ్యాపారులకు తప్ప పేదలకు రుణాలు దక్కడంలేదు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
Tags: KCR, Rahul Gandhi who broke with Modi’s regime