బలపరీక్షకు సిద్ధమన్న కుమారస్వామి

Date:12/07/2019

బెంగళూర్ ముచ్చట్లు:

కర్ణాటక రాజకీయ సంక్షోభం మరో మలుపునకు తిరిగింది. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం హెడీ కుమారస్వామి స్పష్టం చేశారు. బలపరీక్షకు సమయం ఖరారు చేయాలని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ను కోరారు. ఎమ్మెల్యేల రాజీనామాలు, తదనంతర పరిణామాలతో రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని.. అలాంటి సమయంలో తాను అధికారంలో ఉండలేనని ఆయన తెలిపారు. తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. అదే సమయంలో తనకు ముఖ్యమంత్రి పదవిపై వ్యామోహం లేదని స్పష్టం చేశారు.

 

 

 

శుక్రవారం (జులై 12) మధ్యాహ్నం సీఎం కుమారస్వామి కర్ణాటకలో తాజా రాజకీయ అంశాలపై రాష్ట్ర విధాన సభలో మాట్లాడారు. రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేటుపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన కాసేపటికే కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమవడం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది. బలపరీక్షకు స్పీకర్‌ సమయం ఎప్పుడు ఖరారు చేస్తారని రాజకీయ వర్గాలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 

 

రెబల్స్‌ రాజీనామాలు, అనర్హతపై నిర్ణయం తీసుకోవద్దు: సుప్రీం
రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేటుపై యథాతథ స్థితి కొనసాగించాలని కర్ణాటక స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో పరిశీలించాల్సిన అంశాలు మరిన్ని ఉన్నాయని.. అందువల్ల రాజీనామాల ఆమోదం, అనర్హత వేటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో మంగళవారం (జులై 15) తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 224. వీరిలో 16 మంది రాజీనామాలు చేశారు.

 

 

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీరి రాజీనామాలను స్పీకర్‌ ఇప్పుడు అంగీకరించకూడదు కాబట్టి మంగళవారం వరకు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. అసెంబ్లీలో బీజేపీ సంఖ్యా బలం 107. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణం సంఖ్యా బలం 100. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 113. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినా, అనర్హత వేటు వేసినా.. మ్యాజిక్ ఫిగర్ 106కు తగ్గుతుంది. ఈ నేపథ్యంలో బలపరీక్షలో కుమారస్వామి నెగ్గుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

మళ్లీ నష్టాల్లో మార్కెట్లు

Tags: Kumaraswamy ready for the robbery