భారత్ చర్యతో అవాక్కయిన తాలిబన్లు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి అధికారికంగా గుర్తింపు ఇవ్వకపోయినప్పటికీ, ఆ దేశంతో సత్సంబంధాలను కొనసాగించేందుకు భారత దేశం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ‘భారతీయ ఆలోచనలతో మమేకమవడం’ కోసం తాలిబన్లను కూడా ఆహ్వానించింది. భారత దేశంలోని వైవిద్ధ్యాలను వివరించే ఈ కార్యక్రమం నాలుగు రోజులపాటు ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఈ కోర్సులో పాల్గొనాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాలిబన్లను ఆహ్వానించింది.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందిస్తున్న ఈ కోర్సును కొజిక్కోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నిర్వహిస్తోంది. ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యంగల దేశాలన్నీ దీనిలో పాల్గొంటున్నాయి. ఈ ఆన్‌లైన్ కోర్సు మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది.

భారత దేశ విశిష్టత దాని భిన్నత్వంలోని ఏకత్వంలోనే ఉందని ఈ కోర్సు వివరిస్తోంది. ఇది బయటివారికి సంక్లిష్టంగా కనిపిస్తుందని పేర్కొంది. పైకి గందరగోళంగా కనిపిస్తున్నదానిలో అంతర్గతంగా ఉన్న క్రమత్వం గురించి లోతుగా అవగాహన చేసుకోవడానికి ఈ కోర్సు దోహదపడుతుంది. ఫలితంగా భారత దేశ వ్యాపార వాతావరణాన్ని లోతుగా అర్థం చేసుకుని, మదింపు చేయడానికి విదేశీ ఎగ్జిక్యూటివ్‌లకు వీలు కలుగుతుంది. అంతేకాకుండా భారత దేశ ఆర్థిక వాతావరణం, సాంస్కృతిక వారసత్వం, సాంఘిక నేపథ్యం వంటివాటి గురించి తెలుసుకుని, అనుభవం సంపాదించుకోవడానికి ఈ కోర్సు ద్వారా వీలవుతుందని నిర్వాహకులు తెలిపారు.ఈ ఆన్‌లైన్ కోర్సులో ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నుంచి చాలా మంది పాల్గొంటారని తెలుస్తోంది. వారిని ఏకాకులుగా వదిలేయడం కన్నా వారికి అవగాహన కల్పించడం శ్రేయోదాయకమని ఈ కోర్సు గురించి తెలిసినవారు చెప్తున్నారు.
Tags;Taliban surprised by India’s action
