తమిళనాట.. డీఎంకే ఫైల్స్… కలకలం
చెన్నై ముచ్చట్లు:
తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డిఎంకే ఫైల్స్ పేరిట విడుదల చేస్తున్న డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ ఫ్యామిలీ అవినీతి కథలు నమ్మశక్యం కాని నిజాలను బయట పెడుతున్నాయి. స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులు అఫిడవిట్లలో పేర్కొన్న వివరాలను, అఫిడవిట్‌లో వెల్లడించని ఆస్తుల వివరాలను పోల్చుతూ అన్నామలై వీడియో విడుదల చేసి ప్రకంపనలు సృష్టించారు.లెక్కల్లో చూపని ఆస్తుల చిట్టాను అన్నామలై బట్టబయలు చేశారు. ఒక్క స్టాలిన్ ఆస్తులే కాదు.. డీఎంకే మంత్రుల ఆస్తులను కూడా వీడియోలో పూసగుచ్చినట్టు వివరించారు. తమిళనాడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే నేతల చిట్టాను అన్నామలై విడుదల చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో తమిళనాడు బీజేపీ విడుదల చేసిన ఈ జాబితాలో సీఎం స్టాలిన్ తో పాటు డీఎంకే నేతలు 1.34 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు వెల్లడించారు అన్నామలై. డీఎంకే నేతల ఆస్తుల చిట్టాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ వీడియోలో ఇచ్చారు. అంతే కాదుముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిథి స్టాలిన్, అల్లుడు సబరీసన్..
ఒకే ఒక్క సంవత్సరంలో రూ.30 వేల కోట్లు సంపాదించారని, అన్నామలై ఆరోపించారు.అంతే కాదు, ముందు ముందు మరిన్నిఎపిసోడ్స్ విడుదల చేస్తామని అన్నమలై ప్రకతించారు. అన్నట్లుగానే సెకండ్ ఎపిసోడ్ కూడా విడుదలైంది. మరోవైపు.. ట్విటర్‌లోనూ తమిళనాడు బీజేపీ యాక్టివ్‌గా ప్రచారం చేస్తోంది. ట్విటర్‌లో డీఎంకే ఫైల్స్, అన్నామలై ట్రెండింగ్‌లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే బీజేపీ డీఎంకే ఫైల్స్‌పై తమిళనాడు అధికార పార్టీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్ భారతి ‘డీఎంకే ఫైల్స్ ఒక జోక్’ అని కొట్టిపారేశారు. అయితే, మరో వారం పది రోజుల్లో మే 7 ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న స్టాలిన్ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయోపోయిందని,ఇక ముందు స్టాలిన్ ఇంటా బయటా సమస్యలను ఎదుర్కోక తప్పదని పరిశీలకులు అంటున్నారు. మరో వంక ముఖ్యమంత్రి స్టాలిన్’ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు మొదలెట్టినట్లు తెలుస్తోంది. పదేళ్ళ తర్వాత పవర్ లోకి వచ్చి డిఎంకే ప్రభుత్వం రెండేళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రుల పనితీరును, సామర్థ్యాన్ని పరిశీలించిన సీఎం.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అంతే గాక వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు పరుగెత్తాలన్నా, శాఖల వారీగా పలు కార్యక్రమాలు ప్రజల వద్దకు చేరాలన్నా ఔత్సాహికులైన సమర్థవంతమైన మంత్రులు ఉండాలని సీఎం యోచిస్తున్నారు. ఆ ఎన్నికలను ఏ మాత్రం అలక్ష్యం చేసినా, ప్రతిపక్ష అన్నాడీఎంకేకు తగినన్ని సీట్లు వచ్చేందుకు అవకాశం కల్పించినా, మునుముందు తమ పార్టీ కష్టపడాల్సి ఉంటుందని సీఎం భావిస్తున్నారు.అందుకే ప్రతిపక్షం కోలుకునేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేయడంతో పాటు అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించి కింది స్థాయిలోనూ పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేయగలిగే వ్యక్తులు మంత్రివర్గంలో ఉండాలని స్టాలిన్ యోచిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు సీనియర్ మంత్రులను తన టీం నుంచి తొలగించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. శాఖల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సమర్థనీయంగా నిర్వహించలేకపోవడం, అధిష్ఠానాన్ని పట్టించుకోకపోవడం తదితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేర్పులు వుండవచ్చని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.అయితే సీనియర్ మంత్రులను తొలిగించడం అంత ఈజీ వ్యవహారం కాదని ముఖ్యంగా అనేక సంక్షోభాలు చుట్టుముడుతున్న ప్రస్తుత పరిస్థితులలో సీనియర్లను తొలిగిస్తే అది కొరివితో తలగోక్కోవడమే అవుతుందని పరిశీలకులు అంటున్నారు.
Tags:Tamilnadu.. DMK files… Kalakalam
