తాండూరులో తాగు నీటి కష్టాలు

Tandoor drinking water problems

Tandoor drinking water problems

Date:08/12/2018
రంగారెడ్డి ముచ్చట్లు:
తాండూరు రూరల్ మండల పరిధిలోని, గ్రామాలలో మంచినీటి కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భూగర్భజలాలు అడుగంటి పోవడంతో నీరు బయటకు రావడంలేదు. మంచినీటి కోసం గ్రామాలలో ప్రజలు అల్లాడిపోతున్నారు. మంచినీటి కోసం మహిళలు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి వ్యవసాయ పొలాల్లో మంచినీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. సమస్య పరిష్కరించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం చూస్తూ ఉన్నారే తప్పా పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. తాండూరు మండలంలోని ఉద్దండాపూర్, రాంపూర్, జినుగుర్తి తండా, గౌతాపూర్, వీరారెడ్డిపల్లి, బిజ్వార్, మైసమ్మతండా తదితర గ్రామాలలో తీవ్రంగా మంచినీటి ఎద్దడి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి సమస్యను తీర్చాలని ప్రజాప్రతినిధులను, అధికారులను కోరినా వారు పట్టించుకోవడంలేదన్నారు. ఇతర పనులకు చేతిపంపుల నీటిని వాడుకుందామనుకుంటే అవి మరమ్మతులకు గురికావడంతో నీటి సమస్య మరింత జఠిలమైందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. పొలం యజమానులు లేని సమయంలో దొంగతనంగా వెళ్లి మంచినీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని వారు వాపోయారు. తమకు ట్యాంకర్ల సహాయంతో మంచినీటిని అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంచినీటి సమస్య మరింత ముదిరితే రోడ్లపైకి వచ్చి ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేందుకు సిద్దమని మహిళలు హెచ్చరిస్తున్నారు. మంచినీటి కోసం గత ఏడాది రోడ్లపైకి ఖాళీ బిందెలు తీసుకుని వచ్చి నిరసనలు చేస్తేనే మంచినీళ్లు అందించారని గుర్తుచేశారు. అధికారులు స్పందించి గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. గ్రామాలలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించారు. కానీ మంచినీటి సమస్యను తీర్చకపోవడంతో మారుమూల తండాలలో మంచినీటి సమస్య విలయతాండవం చేస్తున్నా గ్రామ కార్యదర్శులు గ్రామాలలో పెన్ను పేపర్‌తో సరిచేసి చూపుతున్నారే తప్పా గ్రామాలలో ఉన్న ముఖ్యంగా మంచినీటి సమస్య తీర్చడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Tags:Tandoor drinking water problems

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *