Natyam ad

తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం

తిరుపతి ముచ్చట్లు:

శ్రీవారి అపర భక్తురాలైన కవయిత్రిమాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు శుక్రవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. టిటిడి తరిగొండ వెంగ‌మాంబ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో రెండు రోజుల పాటు ఈ ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి.     ఈ సంద‌ర్భంగా ఉదయం తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు జరిగింది. సదస్సుకు అధ్యక్షత వహించిన హైదరాబాద్ కు చెందిన పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య అనుమాండ్ల భూమయ్య ఉపన్యసిస్తూ వెంగమాంబ తెలుగులో రచించిన వేంకటాచల మహత్యం చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు. శ్రీవేంకటాచల మహత్యం గ్రంథంలో శ్రీవారి కల్యాణఘట్టాన్ని సరళంగా, సుందరంగా భక్తులకు అందించారని చెప్పారు. వెంగమాంబ తన జీవితాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేశారని తెలిపారు. ఈమె వ్యక్తిగా, సంస్కర్తగా, యోగినిగా, కవయిత్రిగా శ్రీవారి భక్తితత్వాన్ని ప్రచారం చేశారని వివరించారు. అన్నమయ్య కీర్తనల ద్వారా స్వామివారిని ఆరాధించగా, వెంగమాంగ గద్యం, పద్యం, యక్షగానాల రచన ద్వారా భక్తిని చాటుకున్నారని వివరించారు.

 

 

 

Post Midle

తిరుపతికి చెందిన ఆచార్య కట్టమంచి మహాలక్ష్మీ మాట్లాడుతూ వెంగమాంబ తన జన్మస్థలమైన తరిగొండలో 5, తిరుమలలో 13 కలిపి మొత్తం 18 రచనల ద్వారా ఆధ్యాత్మిక, భక్తి, యోగ విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇందులో యక్షగానాలూ, సంకీర్తనలూ, స్తోత్రాలు, పద్యరచనలు, ద్విపద రచనలు ఉన్నాయన్నారు. ఇవేకాక ఆయా సందర్భాలలో ఆశువుగా చెప్పిన పద్యాలూ, శ్లోకాలూ ఎన్నో ఉన్నాయన్నారు.  సంకీర్తనల్లోని భావాన్ని ప్రజల బాణీలోనే తెలియజేసిన ఘనత అన్నమయ్య, వెంగమాంబకు దక్కిందన్నారు.   అంతకుముందు ఉదయం శ్రీమతి లావణ్య, కుమారి కోనేరు లక్ష్మీరాజ్యం బృందం సంగీత సభ నిర్వహించారు. అనంతరం సాహితీ సదస్సులో పాల్గొన్న పండితులను శాలువ, శ్రీవారి ప్రసాదాలతో  సన్మానించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ జి.మధుసూదనరావు బృందం సంగీత సభ జరుగనుంది.ఈ కార్యక్రమంలో  తరిగొండ వెంగ‌మాంబ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డా.సి.లత తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Tarigonda Vengamamba 205th birth anniversary celebrations begin

Post Midle