పనులు అస్తవ్యస్తం (కరీంనగర్)

Tasks clutter (Karimnagar)

Tasks clutter (Karimnagar)

Date:22/09/2018
కరీంనగర్ ముచ్చట్లు:
నగరంలో పైప్ లైన్ పనులు అస్తవ్యస్తంగా మారాయి.నగర సుందరీకరణలో భాగంగా రహదారులను విస్తరించి, కొంతమేర రోడ్లను వెడల్పు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. రహదారికి ఇరువైపుల మురుగునీటి కాల్వలు, కాల్వకు ఆనుకొని విద్యుత్తు స్తంభాలు, టవర్లు, తాగునీటి పైపులైను వేసే పనులు చేపడుతున్నారు. మొత్తం 14.5కిలోమీటర్ల పొడువునా రోడ్డు ఉండగా 7.5కిలోమీటర్ల మేర పూర్తి కాగా, మిగతా 7కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు.
భవిష్యత్తులో వేసిన రోడ్లు మళ్లీ తవ్వకుండా ఉండేందుకు కొత్తగా పైపులైన్ల పనులు చేస్తున్నారు..ఇక్కడీ వరకు బాగానే ఉన్నా..ఇటీవలె వేసిన పైపులైన్లు పైపైనే వేయడంతో ఆ పైపులు ఇప్పుడే పగుళ్లు పెట్టాయి. ఆ పనుల కోసం మళ్లీ రోడ్డు తవ్వే పరిస్థితి ఏర్పడింది. ఇలా తవ్వుకుంటూ, పూడ్చుకుంటూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని నగరవాసులు ఆగ్రహిస్తున్నారు.
నగర పరిధిలో ప్రధాన రహదారులపై పాత పైపులైన్లు తొలగించి కొత్తగా పైపులైన్లు వేసేందుకు నగరపాలక చర్యలు తీసుకొంది.  భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలు కాకుండా పనులు చేయాలనేదీ దీని ప్రధాన ఉద్దేశ్యం. ఆరు నెలల కిందట రూ.కోట్లు వెచ్చించి హెచ్‌డీపీఈ పైపులైన్లకు టెండర్లు పిలిచారు. నగరంలోని ప్రధాన రహదారులపై పైపులైన్ల విస్తరణ పనులు పూర్తి చేశారు.
రోడ్లపై వేసే పైపులైన్లను జాగ్రత్తగా వేయాల్సి ఉండగా ఆ జాగ్రత్తలే తీసుకోలేదనే విమర్శలు లేకపోలేదు. ప్రధాన పైపులైను పక్కనే చిన్న పైపులైను వేయడం, లీకేజీలు అయితే సరి చేసుకోవడానికి కనీసం స్థలం లేకుండా వేసి మట్టి పోసి కప్పేశారు. బస్టాండ్‌ నుంచి సిరిసిల్ల రోడ్డు ఇదే తరహాలో పైపులు వేసుకుంటూ వెళ్లారు. దీంతో పాటు పలుచోట్లా పనులు ఇలాగే సాగాయి.
కొత్తగా పైపులైన్లు వేసే సమయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రధాన రహదారులపై పైపులు వేసే సమయంలో పైపు మీది నుంచి ఒక మీటర్‌ లోతు ఉండాలి. అంటే 1.3మీటర్ల లోతు తవ్వాలి. పైపులు వేసే ముందు, తర్వాత ఆరు ఇంచుల ఇసుక(కుషన్‌) పోయాలి. వెయిట్‌మిక్స్‌ కోసం రోడ్డుకు ఇరువైపుల తవ్వుతుండగా ఒకవేళ భూమి గట్టిగా ఉన్నట్లయితే కొత్తగా వేసిన పైపులైనుపై కాంక్రీట్‌ వేయాలి. ప్లాస్టిక్‌ పైపులు కావడంతో రెండు పైపుల మధ్య అతికించాల్సిన సమయంలో తగిన ఉష్ణోగ్రతల మధ్య వేడి ఉండాలి. జాయింట్లు వంకరటింకరగా ఉండకూడదు. రెండు పైపుల మధ్య జాయింట్లు తొడిగినట్లుగా ఉండాలి.
పైపులైన్లు వేసే సమయంలో సరైన నిబంధనలు పాటించడం లేదు. ఈ విషయం స్పష్టంగా బయట పడింది. వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ మీదుగా సిక్కువాడీ, కమాన్‌ వైపు ఐదు నెలల క్రితం హెచ్‌డీపీఈ పైపులైను వేశారు. ప్రస్తుతం రహదారికి ఇరువైపుల వెయిట్‌మిక్స్‌ వేసేందుకు రోడ్డు తవ్వుతుండగా ప్రొక్లెయిన్‌కు పైపులు తగిలి పగిలిపోయాయి.
సిక్కువాడీ ప్రాంతంలో పలు చోట్లా పైపులు పగిలిపోగా..వేసిన లైను కనీనం మూడు అడుగుల లోతు కూడా లేదనే తెలిసిపోయింది. నగరపాలక ఇంజినీరింగ్‌ అధికారులు సక్రమంగా పర్యవేక్షణ చేయకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయి. పైపులైన్లు వేసేటప్పుడు, జాయింట్లు చేసే సమయంలో పరిశీలించడం అనేదే లేకుండా పోయింది. దీనికి నిదర్శనం సిక్కువాడీలో తేలిన పైపులైను, పెద్దపల్లి రోడ్డులో పైపులైనుకు చేసిన జాయింట్‌ పలుమార్లు లీకేజీ కావడం, చివరికి మూడు రోజుల క్రితం కల్వర్టులో వచ్చిన వాల్వ్‌ మార్చేందుకు చేసిన జాయింట్లు కూడా లీకై నీరంతా ప్రవహించే పరిస్థితి ఏర్పడింది.
Tags:Tasks clutter (Karimnagar)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *