కాంగ్రెస్ లోనూ తాటికొండ రాజయ్యలు

కాంగ్రెస్ లోనూ తాటికొండ రాజయ్యలు

కరీంనగర్ ముచ్చట్లు:

భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు జనగామ ఎమ్మెల్యేగా కొనసాగిన తాటికొండ రాజయ్య వ్యవహార శైలి ప్రతిసారి వార్తల్లోకి ఎక్కేది. పైగా ఆయన మీడియాలో వచ్చిన ప్రతిసారి కూడా మరింత ఎక్కువ చేసేవారు. ఆ వ్యవహారాలు శృతిమించడం.. సర్పంచి నవ్య వ్యవహారం తెరపైకి రావడం తో జనగామ టికెట్ ఇవ్వకుండా కెసిఆర్ పక్కన పెట్టారు. కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. ఫలితంగా తాటికొండ రాజయ్య మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఒకవేళ ఆయన వ్యవహార శైలి మంచిగా ఉంటే ఈసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచేవారేమో. అంటే ప్రజా జీవితంలో ఉండేవారు.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవారు.. బాగుంటే వారి రాజకీయ జీవితం కూడా బాగుంటుంది. వారి వ్యవహార శైలి ఏమాత్రం తేడా ఉన్నా.. మొత్తం తేడా కొట్టేస్తుంది. అసలే ఇవి సోషల్ మీడియా రోజులు కాబట్టి ఏమాత్రం తప్పు జరిగినా తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. గతంలో భారత రాష్ట్ర సమితి నాయకుల వ్యవహార శైలి వల్ల తాము చాలా ఇబ్బంది పడ్డామని.. ఇప్పుడు ఆ పరిస్థితి రాని వద్దని ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. మార్పుకు నాంది పలికారు. తెలంగాణ లో తిరుగుబాటు మొదలైతే ఎలా ఉంటుందో భారత రాష్ట్ర సమితికి రుచి చూపించారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఓ ఎమ్మెల్యే ప్రవర్తన తీరు ఒకింత ఇబ్బందికరంగా ఉంది.

 

 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గం లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రసమయి బాలకిషన్ మీద గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ.. ఇటీవల ఓ వేడుకల్లో వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన ఓ కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కాలు కదిపారు. అంతేకాదు కేక్ కట్ చేసి ఆ క్రీమును పక్కనే ఉన్న ఓ మహిళ ప్రజా ప్రతినిధి బుగ్గ మీద అంటించారు. ఎమ్మెల్యే అలా చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రజా ప్రతినిధి ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆయన అకస్మాత్తుగా అలా చేయడం పట్ల ఒకింత నొచ్చుకున్నారు.అయితే ఈ దృశ్యాన్ని మొత్తం కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తున్న భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం ఈ వీడియోను ట్రోల్ చేయడం మొదలుపెట్టింది.

 

 

కాంగ్రెస్ ఎమ్మెల్యే చిలిపి చేష్టలు పేరుతో ఈ వీడియోను చక్కర్లు కొట్టిస్తోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధుల ఆగడాలు భరించలేకనే మిమ్మల్ని గెలిపిస్తే.. ఇలా చేయడం ఏంటని కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఉద్దేశిస్తూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఉండి ఒక మహిళ బుగ్గ మీద కేక్ క్రీమ్ ఎలా పూస్తారు ప్రశ్నిస్తున్నారు. గతంలో భారత రాష్ట్ర సమితి నాయకులు ఇలానే చేశారని, ఆ తర్వాత ప్రజల చేతుల్లో ఓడిపోయారని.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా అలానే చేస్తున్నారని.. వారి వ్యవహార శైలి శృతిమించితే తర్వాత జరిగేది కూడా అదేనని చురకలు అంటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.

 

Tags: Tatikonda kings in Congress too

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *