ప్రకాశంలో పుంజుకున్న టీడీపీ

TDG revived in brightness

TDG revived in brightness

Date:16/04/2019

ఒంగోలు ముచ్చట్లు :
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. దాదాపు 9 జిల్లాల్లో ప్రశాంతంగానే పోలింగ్‌ ప్రక్రియ ముగిసినప్పటికీ.. నాలుగు జిల్లాల్లో మాత్రం కొంత ఆందోళనలు, ఉద్రిక్తతలు, రక్తపాతం చోటు చేసుకున్న మాటవాస్తవం. అయితే, అన్నింటికంటే విచిత్రం ఏంటంటే.. అందరూ వెయ్యి కళ్ళు పెట్టుకుని ఉత్కంఠగా ఎదురు చూసిన వైసీపీ అధినేత జగన్‌ సొంత జిల్లా కడపలో మాత్రం ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండానే ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడం! ఇక, టీడీపీకి పట్టున్న జిల్లాల్లో మాత్రం ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్నూలు వంటి జిల్లాల్లో రక్తపాతం చోటు చేసుకోవడం ఒకింత ఆందోళనకు గురి చేసిన అంశం. ఇదిలా ఉన్నప్పటికీ.. పోలింగ్‌ ముగిసినా ఫలితం ఇప్పట్లో వెలువడే అవకాశం లేని నేపథ్యంలో పోలింగ్‌ సరళిని బట్టి అంచనాలు వెలువడుతున్నాయి.
ముఖ్యంగా ఈ దఫా ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్‌ చేస్తామని ధీమా వ్యక్తం చేసిన టీడీపీ పరిస్థితి ఒకింత డోలాయమానంలో పడిందనే అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని అనుకున్నా.. దీనికన్నా కూడా అభ్యర్థులపై వ్యతిరేకత అనే అంశం ప్రకాశంలో ప్రభావం చూపుతున్నట్టు తాజా అంచనాలను బట్టి అర్ధమవుతోంది. ప్రధానంగా ఒంగోలు పార్లమెంటు స్థానంలోని మెజార్టీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ దూకుడు ప్రదర్శించింది. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఓటింగ్‌ రూపంలో కనిపించిందని చెబుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం చివరి నిముషంలో అనేక పథకాలను, సంక్షేమాన్ని నగదు రూపంలో ప్రజలపై కురిపించినా.. ఒకవిధమైన వ్యతిరేకతను మాత్రం ఇది ఆపలేక పోయిందనే చెబుతున్నారు విశ్లేషకులు.అదేసమయంలో వైసీపీ తరఫున నిలబడిన అభ్యర్థులు, చివరి నిముషంలో టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి జై కొట్టిన అభ్యర్థుల ప్రభావం చాలా మేరకు కనిపించింది. కొండపిలో టీడీపీ ప్రభావం ఉంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో ఇక్కడ సైకిల్ వేవ్ క‌న‌ప‌డింది. దర్శిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి సిద్దారాఘవరావుపై వ్యతిరేకత లేకపోయినా.. ఆయనను చివరి నిమిషంలో ఎంపీగా పంపించడంతో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్‌ వైపే ప్రజలు నిలబడ్డారని స్పష్టమవుతోంది. క‌నిగిరి నుంచి ఇక్కడ‌కు వ‌చ్చిన క‌దిరి బాబూరావు ఇక్కడ గెలిచే ప‌రిస్థితి లేదు. ఇక‌ అద్దంకిలో గొట్టిపాటి రవి వర్గంలో చివరి నిముషంలో వచ్చిన చీలిక కూడా ప్రభావితం చేసింది. ఇక, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి సానుకూలత ఉన్నప్పటికీ.. ఈ దఫా బాలినేనికి అవకాశం ఇవ్వాలనే ప్రజల ఆలోచన, సింపతీ వంటివి అధికార పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయి.ప‌శ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు, మార్కాపురం, య‌ర్రగొండ‌పాలెంలోనూ వైసీపీ గాలులే క‌న‌ప‌డ్డాయ్‌. క‌నిగిరిలో మాత్రం కాస్త ట‌ఫ్ ఫైట్ ఉన్నా టీడీపీకి స్వల్ప ఎడ్జ్ ఉన్నట్టు క‌నిపించింది. నెల్లూరు లోక్‌స‌భ ప‌రిధిలో ఉన్న కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో ట‌ఫ్ ఫైట్ ఉన్నా వైసీపీకే ఎడ్జ్ అంటున్నారు. ఇక బాప‌ట్ల లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న సెగ్మెంట్ల‌లోనే టీడీపీకి సానుకూల‌త ఎక్కువుగా ఉంది. మొత్తంగా చూసుకుంటే.. గత ఎన్నికల్లో కన్నా ఇప్పుడు ప్రకాశంలో వైసీపీ పుంజుకుందని అంటున్నారు. ప్రభుత్వ సానుకూలత ఓట్లు కేవలం మహిళల నుంచి వచ్చినా..అదికూడా సగానికి సగమే అనే వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం. మొత్తంగా చూసుకుంటే.. ప్రకాశం జిల్లాలో వైసీపీకే ఈ సారి ఎడ్జ్ అంటున్నారు.
Tags:TDG revived in brightness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *