కరీంనగర్ లో టీడీపీ ఆవిర్బావ సభ
కరీంనగర్, ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మా ర్చి 29వ తేదీ. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. తెలంగాణలోని కరీంనగర్‌లో నిర్వహించాలని తెలుగుదేశం ఆధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రమంలో స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంతోపాటు ఆంబేద్కర్ మైదానాన్ని సైతం పార్టీ నేతలు ఇప్పటికే పరిశీలించి… వాటిలో ఒకటి ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సహా పార్టీలోని పలువురు కీలక నేతలు కూడా హాజరుకానున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

అయితే ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రణాళికలు సిద్దం చేసుకొని ముందుకు దూసుకుపోతున్నారు. ఇంకో వైపు తెలంగాణలో ఎలాగైనా గద్దెనెక్కి.. గులాబీ బాస్ కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చేందుకు… మోదీ, అమిత్ షా ద్వయం సారథ్యంలో తెలంగాణలో బీజేపీ నేతలకు స్పష్టమైన సూచనలు.. సలహాలు అందిస్తూ ముందుకు సాగుతోంది. అలాంటి పరిస్థితుల నడుమ రాష్ట్రంలో సైకిల్ పార్టీని సవారీ చేయించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్‌ను చంద్రబాబు నియమించారు. అనంతరం గత ఏడాది ఖమ్మం నగరంలో తెలంగాణ నిర్వహించిన శంఖారావ సభ సూపర్… డూపర్… సక్సెస్ అయ్యింది.
దీంతో పసుపు పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపించింది. అలాగే ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ హయాంలో తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలతోపాటు శాంతి భద్రతలు, హైదరాబాద్ నగరాభివృద్ధి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి తదితర అంశాలను సైతం ప్రజల్లోకి పార్టీ నేతలు చాలా బలంగా తీసుకు వెళ్తున్నారు. ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు… సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని పార్టీ ముందుగా నిర్ణయించింది. కానీ కంటోన్మెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ మార్చిలో విడుదల కానుందని.. ఈ నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ వేదికగా జరపాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. కరీంనగర్ సభ తర్వాత ఇటువంటి సభలు మరిన్ని సభలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో తెలుగుదేశం అగ్రనాయకత్వం నిమగ్నమైనట్లు చెబుతున్నారు.
Tags;TDP Avirbava Sabha in Karimnagar
