రాయలసీమలో పెరగని టీడీపీ గ్రాఫ్

Date:08/10/2018
తిరుపతి  ముచ్చట్లు:
గత ఎన్నికల్లో ఒక్క అనంతపురం జిల్లాను మినహాయిస్తే తెలుగుదేశం పార్టీ మిగిలిన రాయలసీమ జిల్లాల్లో, గ్రేటర్‌ రాయలసీమ అనదగ్గ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా చిత్తుగా ఓడింది. మొత్తం ఐదుజిల్లాల పరిధిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. అనంతపురం జిల్లాపై రుణమాఫీ హామీ గట్టిగా పనిచేసింది. డ్వాక్రా రుణమాఫీ హామీ కూడా టీడీపీకి ప్లస్‌పాయింట్‌ అయ్యింది. అయితే.. మిగిలిన రాయలసీమ జిల్లాలపై మాత్రం రుణమాఫీ ప్రభావం తక్కువే. కొంతవరకూ మాఫీ ఆశల ఓట్లుపడినా అవి తెలుగుదేశం పార్టీని గెలిపించలేకపోయాయి.ఇక గత ఎన్నికలు, గత సమీకరణాల సంగతలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో అధికార పార్టీ పరిస్థితి ఏమిటి? అనేది ఆసక్తిదాయకమైన అంశం.
ఎందుకంటే.. ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి ఉంది. గత ఎన్నికల్లో టీడీపీకి చాలా ప్లస్‌పాయింట్లు కనిపించాయి. ఇప్పుడు అవన్నీ మైనస్‌లుగా మారాయి. గత ఎన్నికల్లో బీజేపీ ద్వారా టీడీపీకి మోడీ హవా కొంతవరకూ కలిసివచ్చింది. అలాగే పవన్‌కల్యాణ్‌ మద్దతు కూడా ఎంతో ఉపకరించింది.ఇప్పుడు టీడీపీకి బీజేపీ వెంటలేదు, మోడీ హవాలేదు, పవన్‌కల్యాణ్‌ సొంత కుంపటి పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అన్నీ ఉన్నా అంతంతమాత్రంగా ఫలితాలు సాధించిన చోట తెలుగుదేశం పార్టీ ఈసారి ఏమవుతుంది? అనేది ఆసక్తిదాయకమైన ప్రశ్న.తన బలాన్ని పెంచుకోవడం ఒకపద్ధతి, ప్రత్యర్థిని బలహీనం చేయాలని అనుకోవడం రెండోపద్ధతి. చంద్రబాబు ఈ రెండో పద్ధతినే ఫాలో అయ్యాడు. గత ఎన్నికల్లో వైకాపా తరఫున గెలిచిన వారిలో ఎవరు వస్తానంటే వారందరినీ చేర్చుకున్నాడు.
ఈ ఫిరాయింపులతో తెలుగుదేశం పార్టీకి వాపు అయితే వచ్చింది కానీ, బలుపు మాత్రం కనిపించడం లేదని స్పష్టం అవుతోంది. ఫిరాయించిన నేతలు పార్టీకి ప్లస్‌ కావడం సంగతి అటుంచితే, వీరిలో చాలామందికి వచ్చేసారి పోటీచేసే ధైర్యమే కనిపించడంలేదు.మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి పలమనేరులో మళ్లీ పోటీచేసి గెలవగలను అనే ధైర్యం మంత్రికి లేదని స్పష్టం అయిపోయింది. ఈ సీట్లో లోకేష్‌ పోటీచేయాలని కూడా ఉచిత సలహా పడేశారు అమర్‌నాథ్‌ రెడ్డి. పుంగనూరులో అమర్‌ మరదలను అభ్యర్థిగా ప్రకటించేశారు. ఫలితంగా అమర్‌ పరిస్థితి పూర్తిగా ఇరకాటంలో పడింది. ఇక్కడ వైసీపీ నుంచి అమర్‌నాథ్‌ రెడ్డి వెళ్లిపోయినా.. పార్టీ గ్రిప్‌ తగ్గలేదు. రేపటి ఎన్నికల్లో ఇక్కడ మళ్లీ వైసీపీ జెండానే ఎగిరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఇక ఆదినారాయణ రెడ్డి కూడా వీలైతే వేరే నియోజకవర్గం అన్నట్టుగానే ఉన్నాడు. ఒక్క అఖిలప్రియ మాత్రమే మళ్లీ ఆళ్లగడ్డ అంటోంది. అయితే చంద్రబాబుకే ఇది ఇష్టంలేదని తెలుస్తోంది. ఆళ్లగడ్డలో ఆమెను కాదని ఏవీ సుబ్బారెడ్డిని నిలిపేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ఒకవేళ ఏవీ నిలిచినా… ఆళ్లగడ్డను వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయమే.ఇక మిగిలిన ఫిరాయింపుదారుల్లో సగంమందికి సీట్లు ఇస్తే ఓడిపోతారని క్లియర్‌ కట్‌గా స్పష్టం అవుతోంది. రేపటి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి మళ్లీ నెగ్గగల ఫిరాయింపుదారులు ఎవరు? అంటే.. గట్టిగా ఎవరి పేరూ చెప్పలేని పరిస్థితి. ఈ ఫిరాయింపు నేతలు వైసీపీలోనే ఉండి ఉంటే… మళ్లీ నెగ్గేవారో లేదో కానీ, టీడీపీలో చేరడం ద్వారా మాత్రం ఓటమిని ఖరారు చేసుకున్నారని స్పష్టం అవుతోంది.
కడపలో ఒక ఎమ్మెల్యే సీటును నెగ్గారు. వచ్చేసారి అదే సంఖ్యలో నెగ్గడం కూడా గగనమే. బాబు సొంతజిల్లా చిత్తూరులో టీడీపీలో ఇప్పుడిప్పుడే ఇన్‌చార్జిలు ఖరారు అవుతున్నారు. అసలే ఇక్కడ పార్టీ పరిస్థితి అంతంతమాత్రం. దానికితోడు బాబు పాలనపై వ్యతిరేకతతో చిత్తూరులో పుంజుకునే ఛాన్సులు లేవు. కర్నూలులో కూడా పరిస్థితి ఇలానే ఉంది. ఇక్కడ గెలవాలంటే.. నంద్యాల ఉప ఎన్నికల స్థాయిలో కష్టపడాలి.ఒక సీటు కోసం అంటే అంతా దిగిపోయారు. రేపు ఎవరిని వారు గెలిపించుకోవాలి కదా. అనంతపురం మీదే టీడీపీకి మళ్లీ ఆశలున్నాయి. అయితే మొన్నటిలాగా స్వీప్‌ సాధ్యంకాదు. కొందరు నేతలు తీవ్రమైన ఆర్థిక బలాన్ని సంపాదించారు. వారు మాత్రమే.. ఓటుకు పది వేలైనా ఇచ్చి గెలవగలం అనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
Tags:TDP graph not in Rayalaseema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *