అడవుల సంరక్షణ కోసం టెక్నాలజీ

Technology for Forestry

Technology for Forestry

Date:10/07/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
అడవులను అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది.  అడవుల సంరక్షణకు మానవ వనరులపైనే ఆధారపడే అటవీ విభాగం ఇకపై సాంకేతిక సేవలు ఉపయోగించుకోనుంది. అడవులపై ఉపగ్రహాల ద్వారా నిఘా పెట్టేలా అటవీ శాఖ దృష్టి సారించింది. పోడు వ్యవసాయాన్ని, చెట్ల నరికివేతను నిరోధించడానికి సర్కారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సాయంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంతో అడవుల పెంపుదలకు కొంత ఉపయోగపడుతోంది. ఎన్‌ఆర్‌ఎస్‌ఏ వ్యవస్థ ద్వారా పోడు భూముల సాగు, అడవుల ఆక్రమణ, అడవుల నరికివేతకు సంబంధించిన సమాచారం అధికారుల కంటే వేగంగా ఉపగ్రహ నివేదిక ద్వారా తెలుస్తుంది. అధికారులు అక్కడ వెంటనే తగిన చర్యలు ప్రారంభిస్తారు. ఒకప్పుడు అడవిలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాకపోయేది.ఆధునిక వ్యవస్థ ద్వారా అడవి మొత్తం ఉపగ్రహం గుప్పిట్లోకి వస్తుంది. ఇక స్మగ్లర్లు యథేచ్ఛగా అడవుల్లోకి కలపను అక్రమ రవాణా చేసే అవకాశం ఉండదు. ఎవరు అడవుల్లోకి వెళ్లినా వారి ఫొటోలతో సహా ఉపగ్రహం సేకరించి అటవీశాఖ అధికారులకు నివేదిక ఇస్తుంది. దీని ద్వారా అడవులను ఆక్రమించే వారు, చెట్లను నరికే వారికి సంబంధించిన ఫోటోలను పంపుతుంది. కేంద్ర ప్రభుత్వ సొసైటీ అయిన ఎన్‌ఆర్‌ఎస్‌ఏ ద్వారా ఈ నెల నుంచి చేపట్టబోయే పథకం అడవుల రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని అటవీశాఖాధికారులు పేర్కొంటున్నారు. అడవులను పరిరక్షించేందుకే ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఎస్‌ఏ వ్యవస్థను అమల్లోకి తెచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు.హరిత హారం పేరుతో విస్తృతంగా ప్రజల్లోనూ అవగాహన పెంచుతోంది. అటవీప్రాంతాల్లో, కాలేజీలు, స్కూళ్లు, ప్రభుత్వ సంస్థల్లో, ఇతర ఖాళీ స్థలాల్లో భారీ స్థాయిలో మొక్కల పెంపకం చేపడుతోంది. మరోవైపు అడవులను రక్షించేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేసింది.అడవులకు ప్రసిద్ధి చెందిన ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌తో పాటు మిగిలిన జిల్లాల్లో అడవుల రక్షణకు వాచర్ల నుంచి మొదలు అసిస్టెంట్ బీట్ అధికారులు, బీట్, సెక్షన్, డిప్యూటీ రేంజి, క్షేత్ర అధికారులు, ఎఫ్‌డీఓలు, జిల్లా అటవీశాఖ అధికారి, అటవీశాఖ సర్కిల్ కన్జర్వేటర్ వరకు పనిచేస్తున్నారు. వీరితో పాటు టాస్క్‌ఫోర్స్ దళాలు అడవుల్లోనే ఉండి రక్షణకు తమవంతు కృషి చేస్తున్నాయి. ఇంత వ్యవస్థ ఉన్నప్పటికీ ఏడాదికేడాది అడవుల విస్తీర్ణం తగ్గిపోవటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో అడవుల పరిరక్షణకు ఉపగ్రహాల ద్వారా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిైపె ఎన్‌ఆర్‌ఎస్‌ఏతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అడవుల్లో చీమచిటుక్కుమన్నా క్షణాల్లో దాని సమాచారం సేకరించి అధికారులకు పంపేలా కసరత్తు చేస్తోంది. ప్రతి నెలా అడవి ఎంత ఉంది, ఎంత క్షీణించింది, ఆక్రమణల వివరాలను ఎన్‌ఆర్‌ఎస్‌ఏ నుంచి ఉన్నతాధికారులకు నివేదిక అందేలా ప్రణాళిక రూపొందించారు. రెండేళ్లకోసారి ఇలాంటి నివేదికలు అటవీశాఖ అధికారులకు అందేవి. ఈలోగా చాలా వరకు అడవులు అంతరించిపోయేవి. నష్టం జరిగిన తర్వాత దాన్ని పూడ్చటం కష్టం కావటంతో దీనిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించి నెల నెలా అడవుల పరిస్థితులు ఎలా ఉన్నాయో భూమి ఆక్రమణకు గురైనా, చెట్టు నరికినా ఇట్టే తెలిసిపోయోలా ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) అనే కేంద్ర ప్రభుత్వ సొసైటీ ద్వారా ఈ నూతన పథకానికి సంబంధించిన ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ సొసైటీ దేశంలోని అటవీ ప్రాంతాన్ని ఉపగ్రహం ద్వారా ప్రతి నిత్యం నిశితంగా పరిశీలిస్తుంది. ఎక్కడెక్కడ అడవికి నష్టం జరుగుతుందనే విషయం గురించి నెలకోసారి నివేదిక ఇస్తుంది. రిజర్వు ఫారెస్టులోని ఏకొద్ది స్థలం ఆక్రమణకు గురైనా ఇట్టే పసిగట్టేస్తుంది. తగినంత మంది అటవీశాఖ సిబ్బంది లేకపోవటం వల్ల అడవులను రక్షించటం గగనమైపోతోంది. గతంలో మాదిరిగా గస్తీలు తిరగటం కూడా లేదు. గతంలో అడవులకు సంబంధించిన వివరాలను అధికారులు లేదా సిబ్బంది ఉన్నతాధికారులకు పంపించటంతో నివేదికలు సరిగా ఉండేవి కావు. అడవులు తగ్గిపోతున్నా బాగానే ఉన్నాయనే నివేదికలు పంపేవారు. ఇలా ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం సేకరించే వ్యవస్థ అటవీశాఖలో లేకపోవటం వల్ల అతితక్కువ కాలంలోనే అడవులు అంతరించి పోయాయి. వీటి ఫలితంగా వర్షాలు గణనీయంగా తగ్గి దేశంలో క్షామ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
 అడవుల సంరక్షణ కోసం టెక్నాలజీ https://www.telugumuchatlu.com/technology-for-forestry/
Tags:Technology for Forestry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *